Friday, March 29, 2024

కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల వర్క్‌షాప్‌.. జూన్‌ 1, 2 తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్‌ రెండు రోజుల పాటు పార్టీ సీనియర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ నిర్వహించిన ‘ చింతన్‌ శిబిర్‌ ‘ తరహాలోనే టీ పీసీసీ.. రాష్ట్రంలో వర్క్‌షాప్‌ నిర్వహించి పార్టీ బలోపేతం, భవిష్యత్‌ నిర్ణయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే వరంగల్‌ రైతు సంఘర్షణ సభ విజయవంతమైందని, ప్రస్తుతం రైతు రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌కు స్పందన రావడం.. పార్టీ నాయకత్వమంతా గ్రామాల్లోకి వెళ్లడం పార్టీ బలోపేతానికి దోహదం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కార్యక్రమాలపై మరింతగా లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని, అందుకనే .. పార్టీ సీనియర్లతో జూన్‌ 1,2 తేదీల్లో వర్క్‌షాప్‌ ను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి వివరించారు.

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఏఐసీసీ నిర్వహించిన ‘ చింతన్‌ శిభిర్‌ ‘లో దేశ వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి గల అంశాలపై చర్చించి తీసుకున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ కూడా ముఖ్య నాయకులతో రెండు రోజుల పాటు వర్క్‌షాప్‌ నిర్వహించి పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇప్పటీ వరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేయాల్సిన అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నారు. అసెంబ్లి ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నదని, పార్టీ కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా రెండు రోజుల పాటు నిర్వహించే వర్క్‌షాప్‌కు పరిమిత సంఖ్యలోనే పార్టీ నేతలను ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారు. టీ పీసీసీ కార్యవర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో పాటు డీసీసీ అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement