Wednesday, March 27, 2024

దళిత బందుకు ధీటుగా కొత్త పథకంపై కాంగ్రెస్‌ ఫోకస్‌ ..!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటీ నుంచే సమాయత్తమవుతోంది. ఒక వైపు ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దూకుడు పెంచుతూనే.. మరో వైపు అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే భరోసాను కూడా ప్రజలకు కల్పిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోను మూడు నెలలకు ముందుగానే ప్రకటిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ.. అంతకు ముందే రాష్ట్రంలోని వివిధ వర్గాలను తమ ఓటు బ్యాంక్‌గా మల్చుకోవడానికి ప్రత్నం చేస్తోంది. ఇప్పటికే వరంగల్‌ రైతు గర్జన సభలో ప్రకటించిన ‘ రైతు డిక్లరేషన్‌ ‘ తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి కూడా డిక్లరేషన్లు ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్‌ సమాలోచనలు చేస్తున్నది. అందుకు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సభలు నిర్వహించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తున్నది. ఇటీవలనే రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ‘ నవ సంకల్ప్‌ శిబిర్‌ ‘ లోనూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. టీ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక.. మొదటగా దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించడం, ఆ వర్గాలను కాంగ్రెస్‌ పార్టీకి ఆకర్షితులయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దళిత, గిరిజనులకు సంబంధించిన అసైన్డ్‌, పోడు భూముల అంశాన్ని పరిష్కరించడంతో పాటు ఆర్థిక స్థిరత్వం, స్వాలంభన దిశగా ఆలోచన చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను సీఎం కేసీఆర్‌ ‘ దళిత బందు ‘ పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విడతల వారీగా రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. మొదటి విడత ప్రతి అసెంబ్లిd నియోజక వర్గంలో 100 దళిత కుటంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నది. యాదాద్రి- భువనగిరి జిల్లాలోని వాసలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత కూడా తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానకి గాను రెండో విడత దళిత బంధు పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోనున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకానికి ధీటుగా.. కాంగ్రెస్‌ పార్టీ మరో పథకం తీసుకొస్తామని ఆ వర్గాలకు హామీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పట్టించుకోకపోగా.. ఆ నిధులను వేరే పథకాలకు మళ్లించారనే విమర్శలు ఎదుర్కొంటున్నది. ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా ఇచ్చే సబ్సీడి రుణాలు కూడా సకాలంలో విడుదల కావడం లేదని, లక్షల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయా వర్గాలకు సంబంధించిన నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి, ఆర్థిక స్వావలంభన కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం రూపకల్పన, ఏర్పాటుకు మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనరసింహ అప్పటీ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్య మంత్రిగా కీలకంగా వ్యవహారించారు. ప్రస్తుత ఏడాది పూర్తిగా ఖర్చు కాకుండా మిగిలిన నిధులను వచ్చే ఏడాదికి బదాలాయింపు ( క్యారీ ఫార్వర్డ్‌ ) చేయాలని చట్టంలో పొందుపర్చారు. ఇప్పుడది పూర్తిగా అమలు కావడం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దళిత బంధు కు ధీటుగా అమలు చేయాలనుకున్న పథకానికి ఆ వర్గానికి చెందిన నాయకులతో ఒక కమిటీ వేసి నివేదిక రూపకల్పన చేయించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.

ఆర్థిక నిపుణులతో చర్చించనున్న కాంగ్రెస్‌..

ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టానికి మరింత పదును పెట్టి అమలు చేయాలా..? లేక దళిత బంధు తరహాలో మరో కొత్త పథకం అమలు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. సబ్‌ప్లాన్‌ ద్వారా అయితే బ్యాంక్‌ లింకేజీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుందని, దళిత బంధుకు ప్రత్యామ్నాంగా ఏర్పాటు చేసిన పథకంతో రూ. 10 లక్షలకు కాకుండా మరిన్ని నిధులు పెంచి అమలు చేస్తామనే హామీ ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివిధ రాజకీయ వర్గాలు, ఆర్థిక నిపుణులతో చర్చించనున్నారు. రైతు డిక్లరేషన్‌ ప్రకటనకు ముందుకు కూడా వ్యవసాయ, ఆర్థిక నిపుణులతో ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వంపై దళిత, గిరిజన వర్గాలు గుర్రు.. ఎస్‌కే నివేదిక..

రాష్ట్ర ప్రభుత్వంపై దళిత, గిరిజన వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆ వర్గాలను కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవడానికి మంచి అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు అధిష్టానికి ఒక నివేదిక ఇచ్చారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో.. నియోజక వర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చినా అక్కడ పరిస్థితి ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చిందని, ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని తానిచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దళిత, గిరిజన వర్గాలకు పార్టీ బలమైన హామీ ఇస్తే ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌కు మళ్లుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement