Tuesday, April 23, 2024

Delhi: 18 నుంచి పర్యాటక మంత్రుల సదస్సు.. ధర్మశాల వేదికగా టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్‌పై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశీయ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 18వ తేదీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సు ప్రారంభం కానుంది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రులు, పర్యాటక రంగానికి చెందిన ఇతర భాగస్వామ్యులు పాల్గొననున్నారు.

ఈనెల 18, 19, 20 తేదీల్లో మూడ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు మొత్తం 250 మంది వరకు ప్రతినిధులు పాల్గొంటున్నారని కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆతిథ్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. పర్యాటక రంగంలో మౌలిక వసతుల కల్పన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటకం, హిమాలయ రాష్ట్రాల్లో పర్యాటకం, సుస్థిర పర్యాటకం, పర్యాటక రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ప్రమోషన్, హోం స్టే సదుపాయాలు, భారతీయ ఆతిథ్య రంగం ప్రత్యేకతలు, ఆయుర్వేదం, వెల్‌నెస్, మెడికల్ వ్యాల్యూ ట్రావెల్, దేశీయ పర్యాటకాభివృద్ధి వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. వీటితో పాటు వైల్డ్ లైఫ్ టూరిజం, రెస్పాన్సిబుల్ టూరిజం, జీ-20 దేశాల్లో పర్యాటక సంబంధిత అంశాలపై పరస్పర సహకారం, పర్యాటక శాఖ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షకూడా జరపనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement