Wednesday, April 24, 2024

తెలంగాణలో 4, 9 తరగతులకు తెలుగు తప్పనిసరి

తెలంగాణలో అన్ని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్ల‌లో తెలుగును ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా బోధించాల‌న్న 2018 ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి ఈ ఏడాది 4, 9 త‌ర‌గ‌తుల్లో తెలుగు సబ్జెక్టును త‌ప్ప‌నిస‌రి చేస్తూ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రీసెర్చ్ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వం, ప్రైవేటు, ప్రైవేటు ఎయిడెడ్‌, తెలుగు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌లో 1 నుంచి 10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలుగును త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్ట్‌గా ఇప్ప‌టికే బోధిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే విధానాన్ని ఇతర మీడియంలు కూడా పాటించాలంది. అయితే సీబీఎస్‌, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లు దశలవారీగా ఈ విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది. ప్రతీ ఏడాది ఒక తరగతి టెక్ట్స్‌బుక్స్‌ను సిద్ధం చేస్తుంటారు. ప్రైమరీ దశలో క్లాస్‌ 1 నుంచి అదేవిధంగా సెకండరీ లెవల్లో క్లాస్‌ 6 నుంచి 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్ర‌కారం 2018-19లో 1, 6 తరగతులకు, 2019-20లో 2, 7 తరగతులకు, 2020-21లో 3,8 తరగతులకు, 2021-22లో 4,6 తరగతులకు, 2022-23లో 5, 10 తరగతులకు తెలుగు బోధించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రకారం ప్రైమరీ దశలో క్లాస్‌ 1,2,3 అదేవిధంగా సెకండరీ దశలో క్లాస్‌ 6, 7, 8 తరగతుల్లో ఇప్పటికే తెలుగును తప్పనిసరిగా బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విద్యాసంవత్సరం క్లాస్‌-4, క్లాస్‌-9 తరగతుల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement