Thursday, March 30, 2023

జాతీయ రహదారులకు భూసేకరణ పూర్తి చేయండి.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం భారతమాల కార్యక్రమం తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రహదారుల నిర్మాణానికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఈమేరకు ఆయన గురువారం కేసీఆర్‌కు లేఖ రాశారు. మాజీ ఉపప్రధాని, నాటి కేంద్ర హోం మంత్రి శ్రీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ చొరవతో 17 సెప్టెంబర్, 1948న నాటి నిజాంల నియంతృత్వ పాలన నుండి విముక్తిని పొంది భారతదేశంలో విలీనమైన నాటి నుంచి 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటి వరకు దాదాపు 66 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ర వ్యాప్తంగా 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులను నిర్మించామన్నారు.

- Advertisement -
   

రాష్ట్రంలో మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని కిషన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అందులో ₹32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 జాతీయ రహదారుల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని, వాటి నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి అవసరం ఉందని తెలిపారు. ఈ భూమి సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు అనేకసార్లు లేఖలు రాసిందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమిని మాత్రమే జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసిందని, మిగతా 4,048 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయవలసి ఉందని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన జరిగాక లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి, వేలాది కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన జాతీయ రహదారులు ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయని హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ఆయా జాతీయ రహదారి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని సకాలంలో అందించి, ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి వీలుగా చర్యలు తీసుకోవలసినదిగా కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement