Saturday, April 20, 2024

అసెంబ్లీలో ఎర్రజెండా.. టీఆర్‌ఎస్‌ సీట్లపై వామపక్షాల కన్ను

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా పొడిచిన టీఆర్‌ఎస్‌, వామపక్షాల పొత్తు వచ్చే అసెంబ్లి ఎన్నికల్లోనూ కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వామపక్షాలతో ముందుకు సాగేందుకు నిర్ణయించడం, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ దీనివల్ల పార్టీకి ప్రయోజనాలు ఉండడంతో కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలోని బీజేపీని మతోన్మాద పార్టీగా తూర్పారబట్టే వామపక్షాలను కలుపుకుంటే రాష్ట్రంలోనూ బీజేపీ వ్యతిరేక ఉద్యమానికి, వ్యతిరేక శక్తులను కలుపుకుని ముందుకుసాగేందుకు ఉపకరిస్తుందని గులాబీదళపతి భావిస్తున్నారు.

తాజాగా మోడీ పర్యటన సందర్భంగా కామ్రేడ్ల కార్యాచరణ ఇక ముందు ముందు జరిగే రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోంది. మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడంలో వామపక్ష శ్రేణులు పోటీపడ్డాయి. అరెస్ట్‌లకు వెరవకుండా ఆందోళనలకు దిగారు. రానున్న రాజకీయ పరిణామాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో యుద్ధం చేసేందుకు వామపక్షాలు తోడైతే అదనపుబలం తోడైనట్లేనని రాష్ట్రస్థాయిలో అంచనాలున్నాయి.

మరోవైపు వామపక్షాల బలం కాంగ్రెస్‌కు తోడుకాకుండా జాగ్రత్తలు తీసుకోవొచ్చని, దీనివల్ల గతంలో కలిసిరాని ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండలోనూ మంచి ఫలితాలు సాధించవచ్చని పార్టీ అంచనాగా ఉంది. పార్టీ పెద్దలు సానుకూలంగా ఉండడం, పొత్తులు అనివార్యం కావండంతో వామపక్ష ముఖ్యులు తమ సీట్లపై కన్నేసి కార్యాచరణ మొదలుపెడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే తిష్టవేసుకున్న నేతలకు ఇది కష్టంగా మారింది. వామపక్షాల డిమాండ్లు చాలా ఉన్నా, పరిస్థితులను బట్టి చివరిలో అధినేత కేసీఆర్‌ సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. ఓవైపు పోటీకి రెడీ అంటూనే, మరికొన్నిసార్లు మునుగోడుకే పొత్తు పరిమితం అంటూ వామపక్ష నేతలు తమపని తాము చేసుకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మంలో ఫిఫ్టీ ఫిఫ్టీ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌ మధ్య ఫిప్టీ ఫిప్టీ సర్దుబాటు జరుగవచ్చని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్న భద్రాచలం, మధిరలను సీపీఎం కోరుకుంటుండగా, ఇవి సర్దుబాటు చేసేందుకు టీఆర్‌ఎస్‌ కూడా అభ్యంతరం ఉండదని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018 ఎన్నికల్లో రెండుసార్లు ఒక్క సీటునే టీఆర్‌ఎస్‌ సాధించగా, వామపక్షాలతో పొత్తు ఉంటే పదికిపది గెలుచుకోవొచ్చని టీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనబడుతోంది. నల్లగొండలోనూ ఇదే మ్యాజిక్‌ రిపీట్‌ చేయవచ్చని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ సీట్లపై కన్నేశాయి.

- Advertisement -

ఒక్కో పార్టీ మూడు నుండి ఆరు సీట్లు డిమాండ్‌ చేస్తుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఫలితాలను బేరీజు వేసుకుని నాలుగు నుండి ఐదు స్థానాలు వామపక్షాలకు కేటాయించవచ్చన్న అంచనాలో వామపక్షాల నేతలున్నారు. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడంతో ఈ ఇద్దరికి సీట్లు కేటాయించడం ఖాయమని, పొత్తు పొడవడానికి అదే కీలకం కాబోతుందని పొలిటికట్‌ సర్కిల్స్‌లో వినబడుతోంది. అయితే భద్రాచలం, మధిర మినహా మిగతా స్థానాల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉండడంతో పొత్తు రాజకీయంపై ఆసక్తి నెలకొంది. పాలేరులో ఎర్రజెండా ఎగరడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి ఉన్నారు. కొత్తగూడెంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉండగా, ఈ సీటును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌లో హుస్నాబాద్‌ స్థానంపై సీపీఐ కన్ను ఉంది. ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఇక్కడ పోటీకి ఉత్సాహంగా ఉన్నారు. వైరాలో గతంలో సీపీఐ పోటీ చేసింది. ఇబ్రహంపట్నంలో గతంలో సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. నల్లగొండ జిల్లాలో దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు వంటి స్థానాలు ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. గులాబీ-వామపక్ష రాజకీయాలు భవిష్యత్తులో తెలంగాణలో సరికొత్త రాజకీయ మార్పులకు కేంద్రబిందువు కాబోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement