Wednesday, March 27, 2024

కమ్యూనికేషన్‌ ఓటీటీలకు లైసెన్స్‌ ఉండాలి.. ప్రభుత్వాన్ని కోరిన కాయ్‌

వాట్సాప్‌, సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి కమ్యూనికేషన్‌ ఓటీటీలకూ లైసెన్స్‌ ఉండాలని టెలికం ఆపరేటర్ల సంఘం ( సీఓఏఐ-కాయ్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఆయా కమ్యూనికేషన్‌ సర్వీసులు టెలికం కంపెనీలకు పరిహారం చెల్లించేలా నిబంధనలు ఉండాలని ప్రభుత్వాన్ని విజ్జప్తి చేసింది. ఈ మేరకు టెలికం ముసాయిదా బిల్లు రూపకల్పనలో భాగంగా ఓటీటీ కమ్యూనికేషన్‌ సేవలను ఎలా నిర్వచించాలన్న దానిపై కొన్ని సూచనలు చేసినట్లు కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ తెలిపారు. ఆదాయంలో వాటా పంపకం విషయంలో నిబంధనలు రూపొందించాలని కోరినట్లు తెలిపారు. డేటా వినియోగం ఆధారంగా ఆదాయ పంపకాన్ని భవిష్యత్‌లో అన్ని కేటగిరీల ఓటీటీలకూ దీన్ని వర్తింప చేయాలని కోరినట్లు కొచ్చర్‌ తెలిపారు.

ఓటీటీలు కూడా నెట్‌వర్క్‌ ఆపరేటర్ల లాగే వాయిస్‌, వీడియో, టెక్ట్స్‌ సేవలను అందిస్తున్నాయని, అయినప్పటికీ వాటికి ఎలాంటి లైసెన్స్‌ కాని, లైసెన్స్‌ నిబంధనలు కాని వర్తించడంలేదని కాయ్‌ వాదిస్తోంది. వాటికి టెలికం కంపెనీల తరహాలోనే లైసె న్స్‌ ఉండాలని కోరుతుంది. పన్నులు, సుంకాల రూపంలో 30 శాతం ఆదాయాన్ని తాము ప్రభుత్వానికి చెల్లిస్తుండగా, ఓటీటీ ప్లేయర్లు మాత్రం ఒక్క పైసా చెల్లించడంలేదని తెలిపారు. ఒకే తరహా సేవలందిస్తున్న వాటన్నింటికీ ఒకే తరహా నిబంధనలు ఉండాలని కాయ్‌ చాలా కాలంగా కోరుతోంది. ప్రైవేట్‌ టెలికం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కాయ్‌లో సభ్యులుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement