Friday, April 19, 2024

డీసీసీబీల్లో కామన్‌ క్యాడర్‌ బదిలీలు, నెలాఖరులోగా నోటిఫికేషన్‌.. ఉగాదిలోగా బదిలీలు

అమరావతి, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌ (జీఎం), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) స్థాయి అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎక్కడి బ్యాంకులో విధుల్లో చేరితే ఆబ్యాంకులోనే పదోన్నతులు పొందడమే కాదు.. పదవీ విరమణ వరకు కొనసాగేవారు. దశాబ్దాలుగా ఒకే బ్యాంకులో పాతుకుపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఘటనలున్నాయి. వీటన్నింటికీ చెక్‌ పెడుతూ డీసీసీబీల్లో కామన్‌ క్యాడర్‌ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సహకార చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసింది. 2, 3 స్థాయిల్లో పనిచేసే అధికారు (జీఎం, డీజీఏం)ను కామన్‌ క్యాడర్‌ కిందకు తీసుకొచ్చారు.

జోనల్‌ పరిధిలో సీనియారిటీ ప్రాతిపదికన ప్రతి మూడేళ్లకోసారి బదిలీ చేయబోతున్నారు. నైపుణ్యం, పనితీరు ఆధారంగా ఈ బదిలీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 డీసీసీబీ బ్యాంకుల పరిధిలో జీఏం పోస్టులు 24, డీజీఏం పోస్టులు 47 ఉండగా.. ప్రస్తుతం 22 మంది జీఎం, 43 మంది డీజీఏంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి తొలుత బదిలీలు ఆ తర్వాత పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పన బాధ్యతను ఆప్కాబ్‌కు అప్పగించారు. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలు రూపొందించి ఆ వెంటనే బదిలీలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఉగాదికల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement