Sunday, May 28, 2023

Follow up : హిమాచల్‌లో కూలిన బ్రిడ్జి,విరిగిపడిన కొండచరియలు.. 14మంది మృతి

ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కంగ్రా జిల్లాలో చక్కి రైల్వేబ్రిడ్జి శనివారం కుప్పకూలింది. చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14మంది వరకు మరణించారు. కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మండి జిల్లాలో ఓ యువతి మృతదేహం బయటపడింది. ఆ యువతి కుటుంబీకులు ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. క్లౌడ్‌బస్ట్‌ కావడంతో బాగీ నుంచి ఓల్డ్‌కటోలా ప్రాంతంలో ఉన్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మండి జిల్లాలో రోడ్లనీ స్తంభించిపోయాయి.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోనూ శనివారం ఎడతెరపిలేని వర్షాలు కురిశాయి.

డెహ్రాడూన్‌ జిల్లాలో పలుప్రాంతాలు జలమయం అయ్యాయి. తమసనది పొంగి ప్రవహిస్తోంది. ప్రముఖ ఆలయమైన తపకేశ్వర్‌ మహాదేవ్‌ క్షేత్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఆలయ పరిసరాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. సార్క్‌హెస్ట్‌ అనే గ్రామానికి తెల్లవారు జామును శనివారం 2.45 గంటలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం హుటాహుటిన చేరుకుంది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లో కురిసిన భారీ వర్షానికి కత్రాలోని వైష్ణోదేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. మరోవైపు ఒడిశాలోనూ వరదలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌ , ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో నూ ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement