Saturday, March 23, 2024

ఉత్తర భారతంపై చలిపంజా.. మరో వారంపాటు తీవ్రమైన చలిగాలులు: ఐఎండీ

ఉత్తర భారతదేశంలో శీతల గాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. రాత్రిపూట మైనస్‌ డిగ్రీలకు చేరుతుంటడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లి, పంజాబ్‌, జమ్ము-కాశ్మీర్‌ వంటిచోట్ల చలిగాలుల ప్రభావం మరిన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం ఢిల్లిలోని పాలమ్‌, నపుర్‌జంగ్‌లో ఉదయం 5.30 గంటలకు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధానిలో రాత్రివేళ కనిష్ట-గరిష్ట ఉష్ణోగ్రతలు 5-8 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది.

రాబోయే కొద్దిరోజులు దట్టమైన పొగమంచు ఉంటుందని అంచనా వేసింది. పంజాబ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వేకువ జామున దట్టమైన మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. నార్నాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

చండీగఢ్‌లో 6.9 డిగ్రీల సెల్సియస్‌ వద్ద చలిగాలులు కొనసాగుతుండగా, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు హిస్సార్‌, రోహ్‌తక్‌, భివానీ, సిర్సా వంటి చోట్ల ఉష్ణోగ్రతలు వరుసగా 3.9, 6.6, 4.4, 4 డిగ్రీల సెల్సియస్‌ వద్ద స్థిరపడ్డాయి. అదే సమయంలో పొగమంచు కారణంగా అనేక రైలు సర్వీసులు ప్రభావితం అయ్యాయి. దృశ్యమానత 0-50 మీటర్ల మధ్య ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement