Saturday, December 7, 2024

బొగ్గు గనుల వ్యర్థాల నుంచి ఇసుక.. భారీస్థాయిలో ఉత్పత్తికి కోల్ ఇండియా ప్రణాళిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇష్టారాజ్యంగా నదుల్లో నుంచి తవ్వితీస్తున్న ఇసుకతో జరిగే పర్యావరణ నష్టాలను నివారించడానికి కేంద్రం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. పెరుగుతున్న నిర్మాణ అవసరాలను తీర్చడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇసుక ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బొగ్గు గనుల వ్యర్థాల నుంచి భారీస్థాయిలో ఇసుక ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో కోల్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా 5 భారీ ఇసుక ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 2024 నాటికి అందుబాటులోకి వచ్చేలా వీటి నిర్మాణాన్ని చేపట్టింది.

నిజానికి గనులు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 ప్రకారం ఇసుకను “మైనర్ ఖనిజం”గా వర్గీకరించారు. మైనర్ ఖనిజాలపై పరిపాలనా నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. అయితే నది ఇసుకకు ప్రత్యామ్నాయంగా గనుల మంత్రిత్వ శాఖ రూపొందించిన శాండ్ మైనింగ్ ఫ్రేమ్‌వర్క్ (2018) బొగ్గు గనుల ఓవర్‌బర్డెన్ (ఓబీ) ఇందుకు ఓ పరిష్కారాన్ని చూపిస్తోంది. పిండిచేసిన రాక్ ఫైన్స్ (క్రషర్ డస్ట్) నుంచి తయారైన ఇసుక (ఎం-శాండ్) ప్రత్యామ్నాయంగా మారింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ సమయంలో బొగ్గును వెలికితీసేందుకు పైన ఉన్న మట్టి, రాళ్లను తొలగించాల్సి ఉంటుంది. ఆ వ్యర్థాలను డంపింగ్ చేస్తుంటారు.

- Advertisement -

చాలా వ్యర్థాలు భూ ఉపరితలంపై పేరుకుంటున్నాయి. ఇవి గణనీయమైన భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇది పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) గనులలో ఇసుక ఉత్పత్తి కోసం ఓవర్‌బర్డెన్ రాళ్లను ప్రాసెస్ చేయాలని భావించింది. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వ్యర్థాల్లో 60% వరకు ఇసుకరాయి ఉంటుంది. వీటిని ప్రాసెస్ చేసి ఇసుకను ఉత్పత్తి చేయడం అనేక విధాలుగా పర్యావరణానికి మేలు చేయడంతో పాటు నిర్మాణ రంగ అవసరాలను కూడా తీర్చనుంది.

ఎం-శాండ్ ప్రయోజనాలు:

తక్కువ ఖర్చు: సహజ ఇసుకను ఉపయోగించడం కంటే తయారు చేసిన ఇసుకను ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయవచ్చు.

స్థిరత్వం: తయారుచేసిన ఇసుక స్థిరమైన పరిమాణం, ఆకృతిని కలిగి ఉంటుంది. నిర్దిష్ట రకం ఇసుక అవసరమయ్యే నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పర్యావరణ ప్రయోజనాలు: తయారు చేసిన ఇసుకను ఉపయోగించడం వల్ల సహజ ఇసుక తవ్వకాల అవసరాన్ని తగ్గించవచ్చు, తద్వారా ఇసుక తవ్వకం కారణంగా తలెత్తే ప్రతికూల పర్యావరణ ప్రభావాలను నివారించవచ్చు. అదనంగా, బొగ్గు గనుల తవ్వకాల నుంచి వచ్చే వ్యర్థాల భారాన్ని తగ్గించుకోవచ్చు.

తగ్గిన నీటి వినియోగం: తయారు చేసిన ఇసుకను ఉపయోగించడం వల్ల నిర్మాణ ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు కడగాల్సిన అవసరం ఉండదు.

మెరుగైన పని సామర్థ్యం: తయారు చేసిన ఇసుక మరింత కోణీయంగా ఉంటుంది. కఠినమైన ఉపరితలం కలిగి ఉంటుంది, ఇది ప్రాజెక్టులు నిర్మాణానికి మరింత ఉపయోగకరం.

వీటితో పాటు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల్లోని వ్యర్థాలు ఆక్రమించిన భూమిని విముక్తి చేయడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం ఆ భూమిని వినియోగించవచ్చు. వాణిజ్య ఉపయోగంతో పాటు, ఉత్పత్తి చేసిన ఇసుకను నిల్వ చేయడానికి కూడా ఆ భూమిని ఉపయోగించవచ్చు. ఉత్పత్తి అయిన ఇసుక విక్రయాలు బొగ్గు కంపెనీలకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుతాయి. అలాగే నదుల నుంచి ఇసుక సేకరణ తగ్గడం కారణంగా భూమి కోతను నివారించి, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.

కోల్ ఇండియా బాటలో..

బొగ్గు గనుల వ్యర్థాల నుంచి ఇసుక ఉత్పత్తిని మరింత పెంచడం కోసం కోల్ ఇండియా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల తరహాలో అనుబంధ సంస్థలు ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం మోడల్ బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేసింది. ఇందులో విజయవంతమైన బిడ్డర్‌కు ఇసుకను ఉత్పత్తి చేసే విక్రయ ధర, మార్కెట్ ను నిర్ణయించుకునే స్వేచ్ఛను కల్పించింది. బొగ్గు గనుల వ్యర్థాల నుంచి ఇసుక ఉత్పత్తితో పాటు రోడ్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణం, ల్యాండ్ బేస్ లెవలింగ్ తదితర అవసరాల కోసం 1,42,749 క్యూబిక్ మీటర్ల గనుల వ్యర్థాలను విక్రయించింది. తద్వారా రూ.1.54 కోట్లను ఆర్జించింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థలు కూడా గనుల వ్యర్థాలను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఇలాంటి చొరవ తీసుకోవాలని సూచిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement