Wednesday, April 24, 2024

ప్రధాని పర్యటనకు సీఎం హాజరు కావడం లేదు.. సీనియర్‌ మంత్రి వస్తారు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : భారత ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనడం లేదని ఆయన కార్యాలయం సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈనెల 26న హైదరాబాద్‌ వస్తున్న ప్రధాని గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొని విద్యార్థులకు అవార్డులు బహూకరిస్తారు. అనంతరం జరిగే సమావేశంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారని ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల తెలిపారు. సీఎం కేసీఆర్‌ తరఫున మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రి ఒకరు పాల్గొంటారని ఆ మంత్రి పేరు, ఇతర వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదని చెప్పారు. ఐఎస్‌బీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్‌ డేకు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.

ఏ మొహం పెట్టుకుని ప్రధాని తెలంగాణకు వస్తున్నారు : ఎర్రబెల్లి

విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రధాని మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధానికి తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్వాగతం పలకాలని ఆయన సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిలదీశారు. రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణపై ప్రధాని మోడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండడాన్ని ఎర్రబెల్లి సమర్థించారు. పెట్రోల్‌ ధరలను పెంచి తగ్గించి అదేదో తమ ఘనతగా బాజపా నేతలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement