Saturday, March 23, 2024

రైతుబంధుతో రైతులకు నిజమైన సంక్రాంతి.. 7600కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్‌ శుభవార్తను ప్రకటించారు. ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికీ రైతులను ఆదుకునే మహత్తర లక్ష్యంతో యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28 నుంచి విడుదల చేయాలని నిర్ణయించారు. రైతులకు అప్పటినుంచి దశలవారీగా రైతుబంధు నిధుల జమను ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి #హరీశ్‌ రావును సీఎం కేసిఆర్‌ ఆదేశించారు. యాసంగి పంట సాయంగా రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తొలగిపోయి వారికి నిజమైన సంక్రాంతి నిశ్చింతగా జరుపుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది యాసంగి రైతుబంధుకుగానూ రూ. 7600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి రూ. 10వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తున్నది. రైతులకు మద్దతిచ్చేందుకు దేశంలో ప్రవేశపెట్టిన తొలి పథకం ఇదే కావడం గమనార్హం. విత్తనాలు, ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసేందుకు, ఇతరత్రా అవసరాలకు రైతుల చేఊతికి నగదును ప్రభుత్వం అందిస్తున్నది.

గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తిని మరింత ప్రోత్సహించి, రైతుల ఆదాయం పెఉంచేందుకు నగదు రూపంలో ఆర్ధిక సాయం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ 2018 ఫిబ్రవరి 25న ప్రకటించి, 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం ధర్మరాజుపల్లిలో ప్రారంభించారు. 2021-22కు మొత్తంగా రూ. 54వేల కోట్లను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును జమ చేసింది. 60లక్షలకుపైగా రైతులు 1.43 కోట్ల ఎకరాలకు చెందిన భూములకు రైతుబంధును పొందుతున్నారు. తెలంగాణలోని సుమారు 55 శాతంమంది జనాభా వ్యవసాయంపసై ఆధారపడి జీవిస్తోండగా, వారందరికి 90.5శాతానికిపైగా పేదలకు ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్నారు. దీంతో దళారులనుంచి అధికవడ్డీలకు అప్పులు తీసుకునే బాధ తొలగిపోవడంతోపాటు, అప్పుల బాధలతో రైతుల ఆత్మహత్యల పరంపరకు చెక్‌ పెట్టగలిగింది తెలంగాణ సర్కార్‌.

- Advertisement -

ఇప్పటికే ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్తుతో పాటు, రైతు బీమా వంటి పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేకోవలో పంటలు పండించేందుకు నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని అందించడం ద్వారా తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా..దేశ వ్యవసాయ రంగ నమూనాగా ఈ పథకం అమలు దారితీసింది. సీఎం కేసిఆర్‌ వ్యవసాయ అనుకూల, దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాయి. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పలు మార్గాలనుండి రాష్ట్రానికి #హక్కుగా రావాల్సిన రూ. 40 వేల కోట్ల నిధులను రాకుండా కేంద్రం తొక్కిపెట్టింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ,, తెలంగాణ రైతులను ప్రజలను కష్టాల పాలు చేయాలని కేంద్రం చూస్తున్నది. ఇలా కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ది అంశంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతుబంధు నిధులను ఠంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది.

ఇప్పటివరకు కొనసాగించిన పంథానే తిరిగి కొనసాగిస్తున్న ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె రామకృష్ణారావుకు సీఎం కేసిఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాజా నిర్ణయం, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల సీఎం కేసీఆర్‌ పాలనకున్న చిత్తశుద్దికి నిదర్శనంగా నిలిచింది. లక్షలాది మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు పెట్టుబడి సొమ్ము ఈ నెల 28నుంచి రైతులకు అందనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు సంతృప్తిగా ఉంటేనే ఈ రంగంలో ఎంచుకున్న లక్ష్యాలను సాధించగలమన్న కోణంలో సర్కార్‌ చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిధులలేమి ఉన్నప్పటికి, కేంద్రం కోతలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం వెరవకుండా రైతుబంధు నిధులను సాధ్యమైనంత త్వరలో రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement