Thursday, April 25, 2024

హెరిటేజ్‌పై విమర్శలు చేసిన సీఎం జగన్

అమూల్ పాలవెల్లువ అంశంపై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు మేలు చేసేందుకు సహకార రంగాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఏ ఒక్క సహకార సంస్థను కూడా సజావుగా నడవని పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. సహకార రంగంలోని డెయిరీలను సొంత ప్రయోజనాల కోసం మళ్లించారని, తమ ప్రైవేటు ఆస్తులుగా మార్చుకున్నారని విమర్శించారు.

రాష్ట్రంలోకి అమూల్ వచ్చాక పరిస్థితి మారిపోయిందని, డెయిరీలు తప్పక ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం వివరించారు. అమూల్ కారణంగా రైతుకు ఒక లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు రాబడి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. అటు మత్స్యశాఖపైనా సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫిష్ ఆంధ్రా లోగోను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement