Sunday, December 3, 2023

దగ్గరవుతున్న ఈశాన్య భారతం.. ఇంట‌ర్నేష‌న‌ల్ టూరిజం మార్ట్ ప్రారంభం..

కోహిమా నుంచి ఆంధ్రప్రభ ప్రతినిధి స్వరూప పొట్లపల్లి:  విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని మిగతా రాష్ట్రాలకు దగ్గరవుతున్నాయి. ఇన్నాళ్లూ విసిరేసినట్టున్న ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మెరుగుపడుతున్న శాంతిభద్రతలు పర్యాటక రంగానికి ఊతమిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా నాగాలాండ్ రాజధాని కోహిమాలో 9వ ‘ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌’ను ప్రారంభించింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు.

హిమాలయాలు, బ్రహ్మపుత్రా నది లోయలో విస్తరించిన ఈశాన్య రాష్ట్రాల్లో అడుగడుగునా కనిపించే ప్రకృతి సౌందర్యం, భిన్న తెగల జీవన వైవిధ్యం, భిన్న భాషా సంస్కృతులు పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశీయంగానే కాదు, విదేశీ యాత్రికులను సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ టూరిజం మార్ట్ ద్వారా ఇక్కడున్న పర్యాటక విశిష్టతలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమ సామర్థ్యం గురించి ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం దొరుకుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

- Advertisement -
   

ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ కింద విద్యార్థుల బృందం చేపట్టే స్టడీ టూర్ కూడా ఉంది. అలాగే ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన విశిష్టతలను వివరిస్తున్నారు. నాగాలాండ్ ప్రత్యేకతలతో తయారుచేసిన కాఫీ టేబుల్ బుక్‌ను ఈ కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించారు. నాగాలాండ్ ప్రభుత్వానికి, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, అదనపు డైరక్టర్ జనరల్ రూపిందర్ బ్రార్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సత్తా చాటుతాం: నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో 
కోహిమాలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ కేవలం నాగాలాండ్ పర్యాటక రంగాన్ని మాత్రమే కాదు, యావత్ ఈశాన్య భారత పర్యాటక రంగానికి ఊతమిస్తుందని ముఖ్యమంత్రి నెఫ్యూ రియో అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకానికి, పర్యాటక అనుబంధ వ్యాపారానికి గమ్యస్థానంగా మారతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగానే పర్యాటక రంగం దారుణంగా దెబ్బతిన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని కోహిమాలో ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేకతను చాటే ఇలాంటి కార్యక్రమాలను ఈశాన్య రాష్ట్రాల వెలుపల కూడా నిర్వహించే ఆలోచన ఉందా అని ఆంధ్రప్రభ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక సామర్థ్యాన్ని చాటిచెప్పే కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించి పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని బదులిచ్చారు.


 
ఈశాన్యంలో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు అనంతం: అజయ్ భట్
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి అనంతమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈశాన్య రాష్ట్రాలను సందర్శించాలని ఎర్రకోట మీద నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తాను స్వయంగా ఇక్కడి ప్రజల ఆతిధ్యం, నిరాడంబర జీవనం చూసి ఎంతో అద్భుతమైన అనుభూతికి లోనయ్యానని వెల్లడించారు. సంస్కృతి, పర్యాటకం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఎక్కడైతే విభిన్న సంస్కృతి ఉంటుందో అక్కడ పర్యాటకం వృద్ధి చెందుతుందని అన్నారు. ఈ టూరిజం మార్ట్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 75 మంది అమ్మకందారులు, ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మంది కొనుగోలుదారులు పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, పర్యాటక రంగంపై అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ ద్వారా స్వదేశ్ దర్శన్, ప్రషాద్ పథకాల కింద 16 ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు.
 
ఈ కార్యక్రమానికి బ్రూనే దారుస్సలాం, మలేషియా దేశాల హై కమిషనర్లు, మయన్మార్ అంబాసిడర్, వియాత్నాం అంబాసిడర్ సహా పలు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లిన మీడియా ప్రతినిధుల బృందంతో పాటు వీరందరినీ స్థానికంగా కోహిమా పట్టణంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లింది. కిసామా హెరిటేజ్ విలేజ్, కిసామా వార్ మ్యూజియం, మోరుంగ్స్, ఖోనోమా గ్రామం, కోహిమా వరల్డ్ వార్ -2 సెమెట్రీ తదితర ప్రాంతాలకు అధికారులు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు 8 టూరిజం మార్టులను నిర్వహించగా, నాగాలాండ్‌లో తొలిసారి జరుగుతోంది. ఇదివరకు గౌహతి (అస్సాం), తవాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), షిల్లాంగ్ (మేఘాలయ), గ్యాంగ్‌టక్ (సిక్కిం), అగర్తలా (త్రిపుర), ఇంఫాల్ (మణిపూర్)లలో ఈ మార్టులను నిర్వహించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement