Friday, March 29, 2024

ఎల్‌ఐసీ ఐపీఓకు లైన్‌ క్లియర్‌..

ఎల్‌ఐసీ ఐపీఓ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే.. సెబీ నుంచి ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ఎల్‌ఐసీ ఐపీఓకి సెమీ నుంచి ఆమోదం లభించినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఐపీఓగా వచ్చేందుకు సెబీకి ఎల్‌ఐసీ 23 రోజుల క్రితమే దరఖాస్తు చేసుకుందని, అంతలోనే అనుమతి లభించిందని చెప్పుకొచ్చాడు. సాధారణ కంపెనీలకు సెబీ నుంచి అనుమతి రావాలంటే.. కనీసం 30-40 రోజుల సమయం పడుతుందని, కానీ ఎల్‌ఐసీ విషయంలో మాత్రం సెబీ వేగంగా ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. సెబీ ఆమోదం లభించడంతో.. ఇక ఐపీఓగా రావడమే తరువాయి. అయితే ఎప్పుడు ఐపీఓగా మార్కెట్‌లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని సదరు అధికారి వివరించారు. పెట్టుబడుల ఉప సంహరణ లక్ష్యాల్లో భాగంగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఐపీవోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించిందని, అది సాధ్యపడేలా కనిపించడం లేదని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
ఐపీఓ ఎప్పుడు..?

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇదే అభిప్రాయాన్ని పారిశ్రామిక ప్రముఖులు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల కారణంగా ఎల్‌ఐసీ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే అవకాశాలు తక్కువే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా పత్రాలు అందజేసింది. 5శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా రూ.10 ఫేస్‌ వ్యాల్యూ కలిగిన ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. రూ.63,000 కోట్ల వరకు ఖజానాకు చేరుతాయనేది మర్చంట్‌ బ్యాంకర్ల అంచనా. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలుస్తున్నది. ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో జరుగుతుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లు) కలిగిన ప్రభుత్వం.. 5 శాతం వాటాను ఇలా విక్రయించబోతున్నది. కొత్త షేర్ల జారీ అనేది ఉండదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement