Tuesday, September 19, 2023

Delhi | రాజస్థాన్ బీజేపీలో కలహాలు.. అధిష్టానం మదిలో గుబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీలో రాజస్థాన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అధిష్టానం పెద్దలకు తలనొప్పిగా మారాయి. సాధారణంగా రాజస్థాన్ రాజకీయాల గురించి చర్చ మొదలైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య నెలకొన్న విబేధాలే గుర్తుకొస్తాయి. అయితే విచిత్రంగా ఈ రాష్ట్రంలో బీజేపీలోనూ ఇదే తరహా అంతర్గత కలహాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీని కొనసాగిస్తున్న రాజస్థాన్‌లో ఈసారి ఆ ఆనవాయితీ ప్రకారం తమనే గెలిపిస్తారన్న ఆశలు కమలనాథులు పెట్టుకున్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న వర్గపోరు సమస్యను పరిష్కరించడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ బీజేపీ అంటే వసుంధర రాజే మాత్రమే అనుకునేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇతర ముఖ్యనేతలు ఎవరికి వారు తమ తమ వర్గాలను తయారుచేసుకున్నారు. అలా గ్రూపులు కట్టినవారిలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా కూడా ఉన్నారు. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థిని అంటూ ఆమె పలు వేదికలపై చెబుతూనే ఉన్నారు. అయితే 2018 ఓటమి తర్వాత ఆమె క్రియాశీలంగా లేరు. సరిగ్గా ఎన్నికల వేళ బయటికొచ్చి తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఆమె వర్గంలో ముఖ్యనేతగా ఉన్న రాజేంద్ర రాథోడ్ విబేధించడమే కాదు.. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

- Advertisement -
   

దాంతో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరికీ తోడు కేంద్ర మంత్రులుగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సతీశ్ పూనియా కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి సైతం సీఎం పదవిపై ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి తన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు.

ముఖ్యమంత్రి పీఠంపై ఇంత మంది నేతలు ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలా లేక సీఎం అభ్యర్థి ప్రకటించకుండానే ఎన్నికలకు సిద్ధపడాలా అన్న విషయంలో బీజేపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ముందే అభ్యర్థిని ప్రకటిస్తే వర్గపోరు మరింత పెరుగుతుందని, సీఎం పీఠాన్ని ఆశించిన మిగతా నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందని, తద్వారా అది పార్టీకి చేటు చేస్తుందని ఆందోళన చెందుతోంది. ఏ పేరూ ప్రకటించకుండా.. ఆశావాహులను ఆశల్లోనే ఉంచుతూ ఎన్నికలకు వెళ్తే ఎవరికివారు పార్టీ గెలుపు కోసం శ్రమిస్తారని భావిస్తోంది. అందుకే ఈ మధ్య అజ్మీర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆశావహులందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టి ‘ఏకతా’ (ఐకమత్యం) సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. బీజేపీలో అరుదుగా మాత్రమే కనిపించే వర్గపోరు రాజస్థాన్‌ ఎన్నికల వేళ అధినాయకత్వానికి ఆందోళన కల్గిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement