Thursday, March 28, 2024

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌! లింకురోడ్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌.. ఉత్త‌ర్వులు జారీ చేసిన పుర‌పాల‌క శాఖ‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజధాని హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని మిస్సింగ్‌, లింకు రోడ్ల అభివృద్ధి మూడవ దశను చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకుగాను రూ.2410 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్డీసీఎల్‌) ఈ పనులను చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మూడో దశలో భాగంగా 104 రోడ్ల నిర్మాణం…
మూడో దశ లింకురోడ్ల అభివృద్ధిలో భాగంగా మొత్తం 5 ప్యాకేజీల్లో 104 కొత్త కారిడార్లలో రోడ్లు చేపట్టేందుకు పురపాలక శాఖ నిర్ణయించింది. వీటన్నింటి నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా కార్యాచరణ…

తెలంగాణ ఏర్పడిన తర్వాత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలుత నగరంలోని కోర్‌ రోడ్డు నెట్‌ వర్క్‌ను మ్యాపింగ్‌ చేశామని, అనంతరం అధ్యయనం చేసి శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో నగరంలో ఒక రోడ్డు ఎక్కడ ప్రారంభమవుతుందో ఎక్కడ ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉండేదని వారు పేర్కొంటున్నారు. ఇలా చాలా చోట్ల మధ్యలో మిస్సవుతున్న లింకు రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నారు. నగరంలోని ప్రధానమైన ఆర్టీరియల్‌ రోడ్లపై రద్దీని తగ్గించడానికి మిస్సింగ్‌, లింకు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. మొదటి దశలో మొత్తం 38 రోడ్ల నిర్మాణం చేపట్టామని, వీటిలో 3 ప్రారంభించామన్నారు. తొలి దశలో భాగంగా చేపట్టిన 35 లింకు రోడ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. లింకు రోడ్ల నిర్మాణంలో భాగంగా మొత్తం 138 రోడ్లను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడ రోడ్లు నిర్మించవచ్చు అని కలలో కూడా ఎవరూ ఊహించని ప్రదేశాల్లో లింకు రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎస్సార్డీపీ, సీఆర్‌ఎంపీ, హెచ్‌ఆర్డీసీఎల్‌ ఇవన్నీ రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలు, సంస్థలేనని, వీటన్నింటి ద్వారా వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లు అభివృద్ది చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement