Friday, April 19, 2024

Big story : చవితి పండుగ‌ చాలా కాస్ట్‌లీ.. అన్నిటి ధ‌ర‌లు పెర‌గ‌డ‌మే కార‌ణం !

ప్రభన్యూస్ : జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 11 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అంతా సందడి నెలకొంటుంది. వినాయక చవితి రోజున గణేశుడి విగ్రహాలకు బాగా డిమాండ్‌ ఉంటుంది. అయితే, ఈ సారి డిమాండుకు తగ్గ గణేశుడి విగ్రహాలు హైదరాబాద్‌లో తయారు కాలేదు. దీంతో ధరలు బాగా పెరిగిపోయాయి. గణేశుడి విగ్రహాలను ముందస్తుగా కొనుగోలు చేసేందుకు వెళ్తున్న జిల్లా వాసులు అక్కడి ధరలు చూసి షాక్‌ అవుతున్నారు. కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి మాత్రం వినాయకుడి భక్తుల నుంచి భారీగా డిమాండ్‌ ఉందని గణేశ్‌ విగ్రహాల తయారీదారుడు అంటున్నారు. వినాయక చవితికి మరో రెండు రోజులు ఉండగానే ఇప్పటికే భక్తులు భారీగా వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. డిమాండ్‌ ఇంతగా ఉంటుందని విగ్రహాల తయారీదారులు ఊహించలేదు. డిమాండ్‌ అధికంగా ఉండడంతో ధరలు కూడా భారీగా పెరిగాయి.

కొండెక్కిన ధరలతో..!

గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం విగ్రహాల ధరలు భారీగా పెరిగాయి. నాలుగు అడుగుల విగ్రహం గతంలో నాలుగైదు వేలు ఉంటే.. ఇప్పుడు రూ. తొమ్మిది వేల నుంచి రూ.పది వేలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ధరల భారంతో విగ్రహం ఎత్తు గురించి ఆలోచించడం లేదని, కేవలం డిఫరెంట్‌గా మంచి ఆకృతిలో ఉన్న లంబోధరుడిని ఎంపిక చేసుకున్నట్లు మండపం నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్డర్‌ను బట్టి ఎన్ని అడుగుల విగ్రహాన్ని అయినా రూపొందిస్తామని తయారీదారులు చెబుతుండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో నాలుగు నుంచి పది అడుగుల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఎత్తును బట్టి వాటి ధరలు మూడు వేల నుంచి 60 వేల వరకు పలుకుతున్నాయి. ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలు లక్షల రూపాయల్లో ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరగనందున ఈ ఏడాది విగ్రహాల విక్రయాలు భారీగా ఉంటాయని, వ్యాపారులు ఆశిస్తున్నప్పటికీ బుకింగ్స్‌ మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో తయారీదారులు కొంత కలవరానికి గురవుతున్నాయి.

జిల్లాలో 30శాతం పెరిగిన మండపాలు

గత రెండు సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలు జిల్లాలో నిరాడంబరంగా కొనసాగాయి. గతంలో జిల్లాలో కోవిడ్‌ ఆంక్షలు ఉండడంతో మండపాల ఏర్పాటు కూడా తగ్గింది. ఈ యేడు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో జిల్లా వాసులు నవరాత్రులను వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నదమయ్యారు. గతం కంటే జిల్లాలో ఈయేడు వినాయక మండపాల ఏర్పాటు పెరగనుంది. ఇప్పటికే వినాయకులను మండపాల్లో ప్రతిష్టించేందుకు భారీ విగ్రహాలను నిర్వాహకులు కొనుగోలు చేశారు.

- Advertisement -

పండుగకు అన్ని కొనుగోలులే…

ఒకప్పుడు పండుగకు కావాల్సిన వస్తువులను గ్రామాల నుంచి సేకరించేవారు. కానీ ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. వినాయక చవితికి కావాల్సిన వస్తువులను ఎక్కువగా మంది కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి తోరణాల నుంచి పూజకు కావాల్సినవన్ని రెడిమెడ్‌లోనే తీసుకుంటున్నారు. మామిడాకులు, పూలు, పండ్లు, తమలపాకులు, ఓనగాయాలు, కొబ్బరికాయ, మోతికాకులు, వెలిగకాయ, తుమ్మి, సీతాఫలం, బుక్కగులాలు, వెలగపత్రి, గర్క తదితర వాటిని మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. వీటి ధరలు కూడా తక్కువేం లేవు. వాటి దగ్గరికి వెళ్లాలంటే జేబులకు చిల్లు పడినట్లే.

ధరల దడ.. ఎడాపెడా

నిత్యావసరాల ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు. రేట్లు పెరిగిపోయిన పప్పులను తగ్గించుకుని పప్పులేని చారు వైపు మళ్లుతున్నారు. మరికొందరు గ్యాస్‌ సిలిండర్‌ స్థానంలో కట్టెలపొయ్యి వైపు కదులుతున్నారు. పెట్రోల్‌ ధరలు చుక్కల్లో ఉండటంతో ప్రయాణాలూ సామాన్యులపై మరింత భారాన్ని పెంచుతున్నాయి. భగ్గుమంటున్న టమాటా వంటి కూరగాయలు తినడాన్నీ తగ్గించుకుంటున్నారు.మంట పుట్టిస్తున్న వంటనూనెలు.. ఉప్పులు, పప్పుల ఖర్చులు.. ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువు ధర పెరిగింది. దీంతో ఇంటి ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement