రాయపూర్ , ఆంధ్రప్రభ ,: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా సరిహద్దు సుక్మా సమీపాన గురువారం ఉదయం భద్రతా సిబ్బందికి, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అటవీ ప్రాంతంలో ఉదయం భద్రతా సిబ్బంది ఉమ్మడి బృందం యాంటీ మవోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తున్నప్పుడు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఏడాదిలో రెండో సంఘటన
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), సీఆర్‌పీఎఫ్ కు చెందిన జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అడపాదడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, ఈ ఏడాదిలో ఇది రెండో సంఘటన. ఈ నెల ఐదో తేదీన జరిగిన ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే ఈ నెల 6వ తేదీన కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేలి సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి ఎనిమిది మంది జవాన్లు, డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే.