Tuesday, April 16, 2024

Delhi | టీపీసీసీ కార్యవర్గం కూర్పులో మార్పులు.. ఢిల్లీకి క్యూ కట్టిన తెలంగాణ‌ లీడ‌ర్లు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం (టీపీసీసీ) ప్రకటనకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిజానికి ఈ నెల 4న కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు ప్రచారం జరిగింది. దీనికోసం గత నెలలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్, సహ ఇంచార్జులతో కలిసి కసరత్తు చేశారు. ఆ నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కోసం ఈ కసరత్తు జరిగింది. రేవంత్ రెడ్డికి కొత్త సైన్యాన్ని అందజేస్తున్నట్టు పార్టీవర్గాలు ప్రచారం చేశాయి.

అయితే.. పార్టీ అధినేత ఖర్గే, గాంధీ కుటుంబ సభ్యులతో చర్చించి జాబితాకు తుదిమెరుగులు దిద్ది ప్రకటించడ‌మే మిగిలి ఉందనగా.. సీనియర్లు రంగంలోకి దిగారు. ఒకరికి తెలీకుండా మరొకరు ఖర్గేను కలిశారు. రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కసరత్తు సమయంలో సీనియర్లతో ఏమాత్రం సంప్రదింపులు జరపలేదని ఫిర్యాదు చేశారు. కొత్త కార్యవర్గంలో పూర్తిగా తన అనుచరులకే పెద్దపీట వేశారని ఆరోపించారు. కొందరు నేతలు బాహటంగానే తమ అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ పరిస్థితుల్లో కొత్త కార్యవర్గం ప్రకటనకు బ్రేక్ పడినట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నాయి.

సీనియర్లు, యువనేతలు.. ఇద్దరూ కావాల్సిందే
రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కొత్త కార్యవర్గం ప్రకటనపై ఆత్రంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో సీనియర్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) మంగళవారం రైల్లో ఢిల్లీ బయల్దేరారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలవనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండే మంగళవారం సాయంత్రం టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ చేరుకుని అధినేత ఖర్గేతో సమావేశమయ్యారు.

మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతూ పార్టీ అంతర్గత విషయాల గురించి చర్చించినట్టు తెలిపారు. పార్టీలో సీనియర్లు ఎంత ముఖ్యమో, యువతరం కూడా అంతే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. సీనియర్లు, యువనేతల మేలుకలయికతో కొత్త కార్యవర్గం రూపుదిద్దుకుంటే బావుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్ల అనుభవం, యువతరం ఉత్సాహం తోడైతే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని సూత్రీకరించారు. ఇదే విషయంపై తాను అధినేత ఖర్గే దగ్గర చర్చించానని అన్నారు.

- Advertisement -

రేవంత్ Vs సీనియర్లు
రేవంత్ రెడ్డి అనుకూలవర్గం సీనియర్లపై ఫిర్యాదు చేస్తోంది. అడుగడుగునా రేవంత్ రెడ్డికి అడ్డుతగులుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఐక్యత లోపించడం వల్ల ప్రత్యర్థులు లాభపడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటమిలో సీనియర్ల సహాయ నిరాకరణ, ప్రత్యర్థులకు లోపాయికారిగా సహకరించడం కూడా కారణమని వారు విశ్లేషిస్తున్నారు. సీనియర్లు మాత్రం ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరి వల్లనే అని నిందిస్తున్నారు. ఎంత సహాయ నిరాకరణ ఉన్నా డిపాజిట్లు కోల్పోయేస్థాయి పరాజయాలు గతంలో ఎప్పుడూ ఎదురవలేదని వారంటున్నారు. పరస్పరం అధిష్టానం వద్ద ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకోవడంతో అధిష్టానం తాత్కాలికంగా కొత్త కార్యవర్గం జాబితా ప్రకటనకు బ్రేకులు వేసి, జాబితాను సరిదిద్దే ప్రయత్నం చేపట్టినట్టు తెలిసింది. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేసి, కార్యవర్గం జాబితాను ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement