Friday, April 19, 2024

మీ కళ్లద్దాలు మార్చుకోండి.. విమర్శకులకు మోదీ కౌంటర్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. హోలింగిలో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుతో ఈశాన్య రాష్ట్రాల్లో టూరిజం మరింత అభివృద్ధి కానుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విపక్షాలు గతంలో విమానాశ్రయ నిర్మాణంపై చేసిన ఆరోపణలకు మోడీ కౌంటర్‌ ఇచ్చారు. ప్రతి విషయాన్ని వాళ్లు ఎన్నికల కోణంలోనుంచి (విమర్శకులు) చూస్తుంటారని, అలాంటి వాళ్లు పాత కళ్లద్దాలు మార్చుకోవాలని సూచించారు. మూడేళ్ల క్రితం డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసినప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలంటూ మోడీపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఈ విమర్శలకు ఇప్పుడు స్పందిస్తూ, 2019 ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్‌ కు శంకుస్థాపన చేశానని, 2019 మేలో ఎన్నికలు ఉండటంతో విమర్శకులు గగ్గోలు చేశారని అన్నారు. ప్రతీదీ పాత కళ్లద్దాలతో చూడటం అలవాటు ఉన్న విమర్శకులు.. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మోడీ ఇక్కడకు వచ్చారని, ఎప్పటికీ విమానాశ్రయ నిర్మాణం జరగదని విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతీ కార్యక్రమానికి రాజకీయ రంగు పులిమే అలవాటు ఉన్న వారికి ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభం కావడం చెంపపెట్టు అని చెప్పారు. పాత కళ్లద్దాలు తొలగించాలని వారికి చెప్పదలచుకున్నానని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో దేశం ప్రగతి పథం వైపు దూసుకెళ్తోందని, ఇప్పటికైనా ప్రతి విషయానికి రాజకీయ రంగు పులమడం మానుకోవాలని విమర్శకులకు హితవు పలికారు.

డోనీపోలో..
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌కు ”డోనీ పోలో” (సూర్యుడు-చంద్రుడు) అని పేరు పెట్టారు. 690 ఎకరాల విస్తీర్ణంలో రూ.640 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా దీనిని అభివృద్ధి చేసింది. గంటకు 200 మంది ప్రయాణికులను హ్యాండిల్‌ చేయగలిగే ఎనిమిది చెక్‌ ఇన్‌ కౌంటర్లు నిర్మించారు. 2300 మీటర్ల రన్‌వే ఉంది. బోయింగ్‌ 747 విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌కు అనుకూలంగా విమానాశ్రయాన్ని నిర్మించారు. డోనీ పోలో ఎయిర్‌పోర్ట్‌తో అరుణాచల్‌లో మొత్తం మూడు విమానాశ్రయాలు అందుబాటులోకి రాగా, ఈశాన్య రాష్ట్రాల్లో విమానాశ్రయాల సంఖ్య 16కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement