Friday, March 29, 2024

Delhi | సొంత జిల్లాల్లో అధికారులకు పోస్టింగులు వద్దు.. ఎన్నికల రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకునే రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ముఖ్యమైన అధికారుల పోస్టింగులు, బదిలీలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను గుర్తుచేస్తూ తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శకులకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్. బుటోలియా పేరిట లేఖ రాసింది. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను వారి సొంత జిల్లాల్లో విధుల్లో నియమించరాదు.

అలాగే సుదీర్ఘ కాలం పాటు ఒకే జిల్లా, ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులను సైతం కొనసాగించకూడదు. గడచిన నాలుగేళ్లలో మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న అధికారులు లేదా మిజోరాంలో డిసెంబర్ 31, మిగతా రాష్ట్రాల్లో 2024 జనవరి 31 నాటికి మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకుంటున్న అధికారులను ఆయా జిల్లాల్లో కొనసాగించవద్దంటూ ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పదోన్నతి పొంది అదే జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ మూడేళ్ల పదవీకాలం నిబంధన వర్తిస్తుందని తేల్చి చెప్పింది.

అధికారుల జాబితాలో జిల్లా అధికారులు డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు, రెవెన్యూ ఉన్నతాధికారులు, ఎన్నికల విధులు కేటాయించిన నోడల్ అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు సహా సంబంధిత ర్యాంకులకు సమాన హోదా కల్గిన అధికారులు ఉన్నారు. ఇక పోలీసు విభాగానికి వస్తే.. రేంజ్ ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, కమాండెంట్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు సహా సమాన హోదా కల్గిన ఇతర అధికారులు ఈసీ ఉత్తర్వుల పరిధిలోకి వస్తారు. ఈ మేరకు సొంత జిల్లాల్లో ఉన్న అధికారులతో పాటు మూడేళ్ల కంటే ఎక్కువగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని, ఆ వివరాలను జులై 31 నాటికి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని ఆదేశించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement