Thursday, April 18, 2024

కరోనా థర్డ్ వేవ్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం

కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా ముగియడంతో ఇప్పుడు దేశమంతా థర్డ్ వేవ్‌పై దృష్టి సారించింది. ఎందుకంటే థర్డ్ వేవ్‌లో ఎక్కువగా చిన్నారులు కోవిడ్ బారిన పడతారని, అందులోనూ ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరంగా మారుతోందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ క‌రోనా థ‌ర్డ్ వేవ్ వస్తే దానిని ధీటుగా ఎదుర్కోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావం థర్డ్ వేవ్‌పై ఉండకూడదని కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ‌ర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ స‌న్న‌ద్ధ‌త (ఈసీఆర్‌పీ-2) కింద రూ 20,000 కోట్ల ప్యాకేజ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ నిధి ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

ఈ ప్యాకేజ్‌పై ప్ర‌స్తుతం ఆరోగ్య‌, ఆర్ధిక మంత్రిత్వ శాఖ‌లు మ‌దింపు చేస్తుండ‌గా కేబినెట్ ఆమోదం పొందిన అనంత‌రం ప్యాకేజ్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు. ఆస్పత్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, కొవిడ్‌-19 వైద్య ప‌రిక‌రాలు, చికిత్స స‌దుపాయాల పెంపు, అత్యవ‌స‌ర మందుల స‌ర‌ఫ‌రాలతో పాటు జాతీయ‌, రాష్ట్ర స్ధాయిలో ఆరోగ్య మౌలిక వ‌స‌తుల పెంపున‌కు ఈ నిధుల‌ను వెచ్చిస్తారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ ప్యాకేజ్ అమ‌లు కానుండ‌గా ఐసీఎంఆర్ వంటి ప‌రిశోధ‌నా సంస్ధ‌ల‌కు భారీగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా నూత‌న వేరియంట్ల‌ను గుర్తించ‌డం ద్వారా చికిత్స సులువుగా చేప‌ట్టే వెసులుబాటు ఉండ‌టంతో ప‌రిశోధ‌నా సంస్ధ‌ల‌ను ఆ దిశ‌గా ప్రోత్స‌హిస్తారు.

ఇది కూడా చదవండి: డెల్టా ప్లస్ వేరియంట్ డేంజర్.. మాస్క్ తప్పనిసరి

Advertisement

తాజా వార్తలు

Advertisement