Thursday, April 25, 2024

తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి, రాష్ట్రంలో ఆరోగ్య రంగాభివృద్ధికి కృషి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో ఆరోగ్య రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం న్యూఢిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,028 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్ ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ. 800 కోట్లతో వివిధ నిర్మాణాలను చేపట్టినట్టు వెల్లడించారు.

అలాగే సనత్ నగర్‌లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణం, అధునాతన వైద్య సదుపాయాల కల్పన కోసం రూ. 1,032 కోట్లను కేటాయించామన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఆదిలాబాద్‌లోని రిమ్స్, వరంగల్‌లో ని కాకతీయ మెడికల్ కాలేజీలకు ఒక్కో దానికి రూ.120 కోట్ల చొప్పున మొత్తం రూ.240 కోట్లు ఖర్చు చేసి నూతన బ్లాకుల నిర్మాణాలను చేపట్టినట్టు కేంద్రమంత్రి వివరించారు. రూ.902 కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ర వ్యాప్తంగా 4,549 హెల్త్ & వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు రూ.30 కోట్ల నిధులతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సదరన్ రీజియన్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులలో పీఎం కేర్స్ నిధుల ద్వారా 50 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రూ.3,744 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 31.2 లక్షల మరుగుదొడ్లను నిర్మించామని వివరించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలన్న నరేంద్రమోదీ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా లేఖలు పంపవలసినదిగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, అందుబాటు ధరలలో మందులు, వ్యాక్సిన్లు, వైద్య విద్య, ఆయుష్, యోగా, పరిశుభ్రమైన వాతావరణం అనే 6 అంశాలలో ప్రగతిని సాధించడమే లక్ష్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement