Saturday, April 20, 2024

బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు : బడుగుల లింగయ్య యాదవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఇవ్వాల (మంగళవారం) ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు టీఆర్‌ఎస్ బీఆర్ఎస్‌గా మారిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌కు ఇతర రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారని, అనేక మంది పార్టీలో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందే తప్ప ప్రజలకు ఏం కావాలో ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు మోకాళ్ళ మీద నడిచినా ఆ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్సే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను యావత్ భారతదేశం రోల్ మోడల్‌గా తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణలో ఈ ఒక్క రోజులోనే 14,794 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని లింగయ్య యాదవ్ వెల్లడించారు. తమిళనాడు తరువాత తెలంగాణలోనే విద్యుత్ వినియోగం అధికంగా ఉందని ఆయన అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల పంటలు బాగా పండుతున్నాయని, మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. పెన్షన్ పెంపు, రుణ మాఫీ, రైతు బంధు, కల్యాణలక్ష్మి,కేసీఆర్ కిట్‌తో పాటు పలు రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement