Friday, April 19, 2024

జూలై 31 నాటికి సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు

జూలై 31 నాటికి సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. కరోనా ఉధృతి కారణంగా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 30+30+40 ప్రాతిపదికన విద్యార్థులకు మార్కులు కేటాయిస్తామని.. పదో తరగతి మార్కులకు 30% వెయిటేజీ, 11వ తరగతి మార్కులకు 30% వెయిటేజీ, 12వ తరగతి మార్కులకు 40% వెయిటేజీ(యూనిట్, టర్మ్, ప్రాక్టికల్స్) ఉంటుందని CBSE చెప్పింది. కేటాయించిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామంది.

మరోవైపు అదేరోజున సీఐఎస్‌ఈ ఫలితాలను వెల్లడించాలని కేంద్రం భావిస్తోంది. జూన్ తొలివారంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని విశ్లేషించిన నేపథ్యంలో ఆ వివరాలను విద్యాశాఖ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట గడువులోపు ఫలితాల వెల్లడికి బోర్డు చర్యలు తీసుకోనుంది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల నమోదు నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement