Wednesday, April 24, 2024

Delhi: చైల్డ్ పోర్నోగ్రఫీపై సీబీఐ కొరఢా.. 21 రాష్ట్రాలు 59 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చిన్నారులపై జరుగుతున్న లైంగిక హింసపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొరఢా ఝులిపించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. న్యూజీల్యాండ్‌ ఇంటర్‌పోల్ యూనిట్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ ఈ దాడులు చేపట్టింది. సీబీఐ సోదాలు జరిపిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఉన్నాయి. ఇంటర్నెట్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ, చిన్నారులపై లైంగిక దాడులు, హింసతో కూడిన వీడియోలను పరిశీలించిన న్యూజీల్యాండ్ పోలీస్ విభాగం వాటి మూలలు కొన్ని భారత్‌లో ఉన్నట్టు గుర్తించింది. కొందరు భారతీయులు ఈ తరహా వీడియోలను చిత్రీకరించి క్లౌడ్ స్టోరేజి ఆధారంగా అప్‌లోడ్ చేస్తుంటే, ఎక్కువ మంది డౌన్లోడ్ చేసి వాటిని మళ్లీ వేర్వేరు పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తూ సర్క్యులేషన్ చేస్తున్నట్టు గుర్తించిన న్యూజీలాండ్ పోలీసులు, సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ క్రైమ్ ఎగెనెస్ట్ చిల్డ్రన్ (సీఏసీ)ను అప్రమత్తం చేశారు.

ఇంటర్‌పోల్ భారత ప్రభుత్వానికి ఈ సమాచారం ఇవ్వడంతో సీబీఐ కొద్ది రోజుల నుంచి ఆ సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించింది. ఐపీ అడ్రస్‌లతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలను సేకరించి, శనివారం ఉదయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దాడులు చేపట్టింది. గత ఏడాది ‘ఆపరేషన్ కార్బన్’ పేరుతో నిర్వహించిన భారీ ఆపరేషన్ తరహాలోనే శనివారం చేపట్టిన ‘ఆపరేషన్ మేఘ్‌చక్ర్’లో కూడా 50 మందికి పైగా అనుమానితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. సైబర్ ఫోరెన్సిక్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ సహాయంతో వాటిని విశ్లేషించడం ప్రారంభించింది. అందులో పెద్ద మొత్తంలో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు ఉన్నట్టుగా గుర్తించింది. అలాగే బాధితులైన చిన్నారులను గుర్తించే ప్రయత్నం చేస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సీబీఐ వెల్లడించింది.

అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతంగా మారిన ఈ తరహా సైబర్ నేరాలను అదుపుచేయాలంటే అంతర్జాతీయంగా ఇంటర్‌పోల్‌తో పాటు ఆయాదేశాల దర్యాప్తు సంస్థలు, పోలీసు యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, లైంగిక హింసతో కూడిన వీడియోలు, చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో ఉక్కుపాదం మోపుతూ ఆయా దేశాలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. గతంలోనూ ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి ఈ తరహా సైబర్ నేరాలను కట్టడి చేస్తూ వచ్చామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement