Tuesday, April 23, 2024

కులాలవారీగా జనగణన చేపట్టాలి: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

 
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  కులాలవారిగా జనగణన చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆదివారం కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, కులాలవారిగా జనగణన కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం కూడా చేసిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ ఫలాలను వెనుకబడిన వర్గాల్లో కొన్ని వర్గాలు మాత్రమే అందుకున్నాయని, ఇంకా అనేక వర్గాలు నేటికీ వెనుకబడే ఉన్నాయని ఆయనన్నారు. ఈ పరిస్థితుల్లో సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేలా జనగణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలకు సైతం అత్యంత వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టడానికి వీలుకల్గుతుందని తెలిపారు. అందుకే ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో భాగంగా ఈసారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా సేకరించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. జనగణన చేపట్టేది కేంద్రమే కాబట్టి, దేశవ్యాప్తంగా ఈ గణాంకాలు సేకరించాలని అన్నారు.  
 
ఆహారధాన్యాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే 2011 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పార్లమెంటులో చాలా ఏళ్లుగా పెండింగులో ఉండిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి దిశ బిల్లును కూడా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఏపీకి ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. మరోవైపు కనీస మద్ధతు ధరపై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం కొన్ని పంటలపై కనీస మద్ధతు ధర ఇస్తుండగా, సీఎం జగన్ వాటికి అదనంగా మరో 24 పంటలకు కూడా మద్ధతు ధర ఇస్తున్నారని, ఆ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు.
 
ఆ ఏడుపు ఒక డ్రామా..
చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలుగుదేశం నేతలు చేసిన ప్రకటనపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. అసెంబ్లీలో రికార్డులు, ఆడియో, వీడియో ఫైళ్లను పరిశీలించాల్సిందిగా కోరారు. ఏ ఒక్కరూ చంద్రబాబుపైగానీ, ఆయన కుటుంబ సభ్యులపైగానీ ఎలాంటి కామెంట్ చేయలేదని స్పష్టం చేశారు. అయినా సరే.. చంద్రబాబు తనకు తానే ఏదేదో ఊహించుకుని కంటతడి నాటకానికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. సాధారంగా మగాళ్లు ఏడవడం జరగదని, కానీ చంద్రబాబు ఏడుపు చూస్తుంటే మొత్తం డ్రామాలా ఉందని అన్నారు. చర్యకు, ప్రతిచర్య ఉంటుందని, తమ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బయట కొందరు వ్యాఖ్యానించి ఉండొచ్చని విజయసాయి రెడ్డి అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement