Thursday, December 12, 2024

TG | జనగణనలో కులగణన చేర్చాలి.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్న‌ట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఇందిరాభవన్‌లో కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..

కేంద్రం నిర్వహించే జనగణనలో ఓబీసీ అంశం చేర్చి కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన అనేది ఒక లక్ష్యం కోసం.. అణచివేయబడ్డ వర్గాల అభ్యున్నతి కోసం, సంపద సమానంగా పంపిణీ కోసం చేస్తున్న యజ్ఞమని తెలిపారు. రాష్ట్రంలో జరగనున్న కుల గణన సర్వే భవిష్యత్తులో పలు రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహిస్తుందని, అందుకు విస్తృతంగా సంప్రదింపులు, చర్చలు, అభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.

ఈ నెల 5న సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ అధినేత‌ రాహుల్ గాంధీ బోయినపల్లి ఐడియాలజీ సెంటర్ కు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు మేధావులు, ప్రజా సంఘాల నాయకులతో సమావేశమవుతార‌ని, కుల గణన సర్వేకు అవసరమైన అదనపు సమాచారాన్ని సేకరిస్తార‌ని వెల్లడించారు.

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మేధావులు జస్టిస్‌ చంద్రకుమార్‌ , ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌ రావు, ప్రొఫెసర్‌ సింహాద్రి, ప్రొఫెసర్‌ వెంకట నారాయణ, ప్రొఫెసర్‌ భూక్య తదితరులు చేసిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎం అనిల్‌కుమార్‌ యాదవ్‌ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్‌ చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement