Saturday, December 7, 2024

Delhi: కొచ్చి మెట్రో ఫేజ్-2కు కేంద్ర కేబినెట్ ఆమోదం.. రూ.1,957.05 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేరళలో అత్యధిక జనసాంద్రతతో పాటు వైశాల్యంలోనూ పెద్ద నగరంగా నిలిచిన కొచ్చిలో మెట్రో 2వ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం నుంచి కక్కనాడ్ మీదుగా ఇన్ఫోపార్క్ వరకు కొచ్చి మెట్రో రైల్ మొత్తం 11.17 కి.మీ పొడవున 11 స్టేషన్లతో నిర్మాణం జరుపుకోనుంది. రూ.1,957.05 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. సీపోర్ట్ నుంచి ఎయిర్‌పోర్ట్ రోడ్డు వరకు మెట్రో విస్తరణతో పాటు ఫేజ్ -2 ప్రాజెక్టు నిర్మాణం జరుపుకోనుంది. కొచ్చిలో అలువా నుంచి పేట వరకు 25.6 కి.మీ.ల పొడవున 22 స్టేషన్లతో రూ.5181.79 కోట్ల వ్యయంతో నిర్మించిన మొదటి దశ మెట్రో ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తోంది.

పేట నుంచి ఎస్‌ఎన్ జంక్షన్ వరకు 1.80 కి.మీ మేర వయాడక్ట్ తో కొచ్చి మెట్రో ఫేజ్ 1-ఏ ప్రాజెక్టు రూ.710.93 కోట్లతో ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ రంగ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎస్‌ఎన్ జంక్షన్ నుంచి త్రిపుణితురా టెర్మినల్ వరకు 1.20 కి.మీ మేర కొచ్చి మెట్రో ఫేజ్ 1-బి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా నిర్మాణం జరుపుకుంటోంది. కొచ్చి మెట్రోపాలిటన్ ఏరియాలో 2013 లో దాదాపు 20.8 లక్షలు , 2021 లో 25.8 లక్షలు మరియు 2031 నాటికి 33.12 లక్షల జనాభా ఉంటుందని అంచనాలున్నాయి. పెరుగుతున్న జనాభా, పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన రవాణా వసతుల్లో భాగంగా ఫేజ్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement