Saturday, April 13, 2024

అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు.. దళారుల పాల‌వుతున్న ధాన్యం!

నిజామాబాద్ జిల్లాలో రభి వరి పంట నూర్పిడులు గత 20 రోజులుగా కొనసాగుతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో పంటలు పండించిన రైతన్న గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. చేతికిందన వరి ధాన్యం దళారుల పాలవుతుంది. ప్రభుత్వం ప్రతి ఏడాది కొనుగోలు కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ముందుగా నిజామాబాద్ జిల్లాలోని వర్ని కోటగిరి బోధన్ మండలాల్లో 20 రోజులు ముందస్తుగా వరి పంట చేతికందుతుంది. కొనుగోలు కేంద్రాల ద్వారా ఏ గ్రేడ్ ధాన్యాన్ని 2060 రూపాయలకు, బి గ్రేడ్ ధాన్యాన్ని 2040 రూపాయలు ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పంటల పండించడంలో ఇతర జిల్లాలంతా ఒకరకంగా ఉంటే నిజామాబాద్ జిల్లా మాత్రం భిన్నంగా ఉంటుంది. ఖరీఫ్, రభి పంటల సాగు చేయడంలో ఈ ప్రాంత రైతులు నెలరోజులు ముందే సాగు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంత రైతులు చైతన్యవంతులు. ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఈ ప్రాంతంలో వ్యవసాయం చేస్తుంటారు. పలువురు ప్రజా ప్రతినిధులు సైతం తమ వృత్తి వ్యవసాయమేనంటూ ఏ స్థాయిలో పదవిలో ఉన్న తమ వ్యవసాయాన్ని మాత్రం క్రమం తప్పకుండా చేయడమే కాకుండా పంటల సాగులో ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సన్న రకం వరి పంటను సాగు చేస్తారు. సారవంతమైన భూములు నిజాంసాగర్ నీటితో పంటలను సాగు చేయడంతో నాణ్యమైన పంటలు పండుతాయి. ప్రతి ఏడాది రభిలో నవంబర్ మాసంలోనే వరి నాట్లను ఈ ప్రాంతంలో వేస్తారు. ఖరీఫ్ పంట సైతం జూన్ మాసం నుండి వరి నాట్లను ప్రారంభిస్తారు. ఇతర జిల్లాల్లో కోతలు ఆరంభించే సమయానికి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి నారువాళ్లను సిద్ధం చేసుకుంటారు. ఖరీఫ్ లో ముందస్తుగా పంట చేతికి అందితే ఎంతో కొంత మార్కెట్ లో ధాన్యానికి డిమాండ్ పలుకుతుంది. ఇతర జిల్లాల రాష్ట్రాల వారు ఈ ప్రాంతానికి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ప్రాంతానికి ప్రతిసారి తరలిస్తుంటారు. రభిలో ప్రతి ఏడాది ఏప్రిల్ మే మాసాల్లో ఈదురు గాలులతో కూడిన పడగల వర్షం కొరియడంతో ఎన్నోసార్లు ఈ ప్రాంత రైతులు నష్టాలను చూశారు. వాతావరణానికి అనుకూల పరిస్థితులను ఎంచుకొని నిజామాబాద్ జిల్లా రైతాంగం తెలంగాణ రాష్ట్రంలోనే ముందస్తుగా పంటలు సాగుచేస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇతర జిల్లాల వారికి సక్రమంగానే ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో నెల రోజులు ముందస్తుగా వరినాట్లు వేసుకోవడంతో వరి ధాన్యం ముందస్తుగానే చేతికి అందుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం, రెవెన్యూ శాఖ, జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయంలో రైతులకు న్యాయం కలిగేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తే ఈ ప్రాంతంలో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వీలు కలుగుతుంది.

అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో పలు మండలాల్లో ధాన్యం చేతి కంది 15 రోజులు కావస్తుంది. వేలాది ఎకరాల వరి నూర్పిండ్లు ఇప్పటికే రైతన్నలు పూర్తి చేసుకున్నారు. వేలాది లారీల్లో ఈ ప్రాంతం ధాన్యం ఇతర ప్రాంతాలకు దళారులు ప్రతినిత్యం తరలిస్తున్నారు. రైతుల దైన్యం అనే శీర్షికన ఆంధ్రప్రభ పత్రికలో కథనాలు కూడా పలుమార్లు రాయడం జరిగింది. ఎట్టకేలకు నాలుగు రోజుల క్రితం బాన్స్ వాడ‌ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారే కానీ బార్ధాన్ సంచులు లేకపోవడంతో ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలో ఒక్క సంచి కూడా రైతు నుండి సేకరించలేదనేది నగ్నసత్యం. బోధన్ బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రజా ప్రతినిధులు లాంచనంగా ప్రారంభించారు. కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట చేతికి అందింది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు భయాందోళన గురవుతున్నారు. చేతికందిన వరి ధాన్యాన్ని ఎలాగో అలా అమ్ముకుంటేనే ఓ ఒడ్డుకుపడతామన్న దృక్పథంతో రైతులు ఉన్నారు. రైతుల ఆందోళన దళారులు చేతివాటాన్ని ప్రదర్శించి తమ జేబులు నింపుకుంటున్నారు. దళారులు 1600 నుండి 1730 రూపాయలకు క్వింటాలు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు నష్టపరుస్తున్నారు. పచ్చి ధాన్యం తరుగు పేరిట క్వింటాకు ఐదు కిలోలు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement