Saturday, April 20, 2024

దసరా సెలవుల సందడి.. పర్యాటకానికి సందర్శకుల తాకడి

సుమారు మూడేళ్ళ కోవిడ్‌ విరామం తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ మనిషికి అహ్లాదం కలుగుతోంది. రెండు లాక్‌డౌన్ల సమయంలో ఏ వ్యక్తి ఇల్లు వదిలి కాలు కదిపే పరిస్ధితి లేదు. సుదీర్ఘ విరామం తర్వాత కరోనా తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మళ్లీ జనజీవనం ఉూపందుకున్న తరుణంలో ఇప్పుడిప్పుడే ఆహ్లాద వాతావరణం చోటు చేసుకుంటోంది. ప్రతి ఒక్కరూ తమతమ కుటుంబాలతో కలిసి విహార యాత్రలకు మొగ్గు చూపుతున్నారు.

దీనికి తోడు ఇప్పుడు దసరా సెలవుల సందర్భంగా పట్టణనివాసులు స్వంత ఉూళ్లకు.. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అహ్లాద ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. పైగా వాతావరణం కూడా అహ్లాదకరంగా ఉండటంతో పిల్ల పాపలతో ప్రతి కుటుంబం పండుగ సెలవులను ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. సుదూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు వెళ్లలేనివారు తమ అనుకూల బడ్జెలోనే రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విహారయాత్ర ప్లాన్‌ చేసుకుని దసరా సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్‌, గోదావరి పరివాహక ప్రాంతాలు, కొల్లేటి ప్రాంతాలు, విశాఖ, ఉత్తరాంధ్రాలోని పర్యాటక ప్రదేశాలు సందర్శకులను అలరిస్తున్నాయి.

ఆంధ్రా ఊటీ అరకు..

ఆంధ్రా ఊటిగా పిలువబడే అరకులోయలో పరుచుకున్న మంచు తెరల దుప్పటి కొత్త అనుభవాన్ని పంచుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ప్రస్తుత వాతావరణంలో పొగ మంచు తాకిడిలో ప్రకృతి సోయగాలకు పర్యాటకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఇక్కడి వంజంగి మేఘాల కొండ స్వర్గధామంలా గోచరిస్తోంది. ఇక లంబసింగిలో ప్రస్తుత వాతావరణ పరిస్ధితి లో కొత్త అనుభవాలను రుచిచూస్తున్న యాత్రికులు అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ప్రకృతి అందాలతో భూతల స్వర్గాన్ని తలపించే అల్లూరు జిల్లా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. ఇక్కడి సహజ అందాలతో సెల్ఫీలు దిగుతూ చెరగని గురుతులు సంపాదించుకుంటున్నారు.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న సందర్శకులతో ఆంధ్ర ఊటి అరకులోయ అలరారుతోంది. ఇక్కడి చల్లటి నల్లని మేఘాలకు చినుకులు తోడు కావడం, ఎత్తయిన కొండల నుంచి పారే జలపాతాల సోయగాలు, మన్యంలోని పర్యాటక ప్రదేశాలు, కొండలు, ఘాట్‌ రోడ్‌ లు సరికొత్త అందాలను పంచుతున్నాయి. శీతాకాలంలో ఉండే వాతావరణం ఇప్పుడు ముందే అరకులో ప్రతి ఒక్కరిని పలుకరిస్తుండటంతో పర్యాటకులు దసరా సెలవులను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. పచ్చని తివాచీలా పరుచుకున్న తోటలు, అత్యద్భుతమైన బొర్రాగుహలు ఇలా అరకులో కొదవేలేని అందాలను కుటుంబ సభ్యులు చాలాకాలం తర్వాత ఆస్వాదిస్తున్నారు.

కనువిందు చేసే గిరిజన సంస్కృతి..

విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పర్యాటక ప్రదేశాలు సందర్శకులను అలరించడం ఒక ఎత్తయితే ఇక్కడి గిరిజన ప్రాంతాల సంస్కృతి మరింత కనువిందు చేస్తోంది. వారి సంప్రదాయ వస్తృ ధారణ, వంటకాలు, జీవన శైలి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పైగా గిరిజన ప్రజల పలకరింతలు, వారిచ్చే ఆతిధ్యాలు, మర్యాద మన్ననలు వారి ప్రత్యేక తను చాటుతున్నాయి. చాపరాయి జలవిహారి, పద్మాపురం ఉద్యానవనకేంద్రం, గిరిజన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా మ్యూజియం, ఎత్తైన చెట్లతో అంజోడ పార్కు వెడ్డింగ్‌ షూట్లకు నిలయమైంది.

ఇక పాడేరు మన్యంలోనూ.. జలపాతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వందలాదిగా వాహనాలు పర్యాటక ప్రాంతాలకు తరలి వస్తుండడంతో ఘాట్‌రోడ్లు కిక్కిరిస్తున్నాయి. టూరిస్ట్‌లు బస చేసే గదులకు డిమాండు పెరిగింది. దీంతో చాలామంది సందర్శకులు ఇక్కడి ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏదేమైనా కోవిడ్‌ నేపథ్యంలో గత మూడేళ్లుగా స్తంభించిన ఈ తరహా ఆనందానికి మళ్లీ పరిస్థితులు చక్కబడడం.. వాతావరణం కూడా అనుకూలంగా మారడం.. దసరా సెలవులు తోడవడంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు పెరిగిన సందర్శకుల తాకిడి ఇలానే మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement