Friday, November 15, 2024

Business Story: మార్కెట్‌లో బుల్‌ రన్‌, మూడో రోజూ లాభాలే..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ జోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం మార్కెట్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు సూచీలు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య మరోసారి చర్చలు జరుగుతుండటంతో.. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కొనసాగినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు దేశీయ సూచీలు రాణించేందుకు కారణం అయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 58,362.85 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో.. 58,727.78 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,176 పాయిట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 740.34 పాయింట్లు లాభపడి.. 58,683.99 పాయింట్ల వద్ద ముగిసింది. 17,468.15 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో17,522.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 172.95 పాయింట్లు లాభపడి.. 17,498.25 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.75.91 వద్ద ట్రేడ్‌ అవుతున్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌.. దాదాపు నెలన్నర రోజుల తరువాత.. 58వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది. చివరిసారి ఫిబ్రవరి 10న సెన్సెక్స్‌ 58వేల పాయింట్లు క్రాస్‌ చేసింది. ఆ తరువాత వరుస నష్టాలతో.. ఒకానొక దశలో 52వేలకు పడిపోయింది. బుధవారం దేశీయ సూచీలు జోరు చూపించడంతో మళ్లి 58వేల మార్క్‌ను క్రాస్‌ చేసింది, పుంజుకున్న హీరో మోటో కార్ప్ సెన్సెక్స్‌ 30లోని షేర్స్‌లో.. బజాజ్‌ ఫైనాన్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌ గ్రిడ్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే ఇండియా, రిలయన్స్‌ కొటక్‌ మహీంద్రా బ్యాంకు షేర్లు అత్యధికంగా లాభపడిన జాబితాలో ఉన్నాయి. ఐటీసీ, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలు పొందాయి. హీరో మోటో కార్ప్‌ ప్రకటన.. షేర్‌ విలువను 2 శాతం పెరిగేందుకు కారణమైంది. రూ.1000 కోట్ల బోగస్‌ వ్యయాలు సంబంధించిన ఆధారాలు లభించినట్టు వార్తలు రావడంతో కంపెనీ స్పందించింది. ఐటీ దాడుల నేపథ్యంలో మంగళవారం షేరు విలువ 7 శాతానికి పైగా క్షీణించింది. ఏప్రిల్‌ 5 నుంచి మోటార్‌ సైకిల్స్‌, స్కూటర్ల ధరలు పెంచుతున్నట్టు హీరో మోటో కార్ప్‌ ప్రకటించడం కూడా సానుకూల అంశం. అందుకే బుధవారం షేరు విలువ కొంత పుంజుకుంది.

భారీగా లాభపడిన ఇన్వెస్టర్లు..

నిఫ్టీలో లోహ, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా మిగిలిన రంగాల సూచీలు అన్ని లాభాలు పొందాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ బుధవారం ఏకంగా రూ.2.23 లక్షల కోట్లు పెరిగి.. రూ.2,63,84,461.77 కోట్లకు చేరుకుంది. ఇరాక్‌ ప్రభుత్వానికి చెందిన రిఫైనరీకి సంబంధించిన ఓ కీలక ఆర్డర్‌ను దక్కించుకోవడంతో.. భారత్‌ హెవీ ఎలక్ట్రిక్‌ షేర్లు రెండు శాతానికి పైగా పుంజుకున్నాయి. ఈ వారంలో ఇదే ఒకరోజు గరిష్టంగా నిలిచింది. నెల రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. దీనికితోడు టర్కీలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతుండటం కూడా మార్కెట్లను లాభాల్లోకి పయనించేలా చేశాయి. రష్యా, ఉక్రెయిన్‌ దేశాలు యుద్ధంపై వెనక్కి తగ్గుతున్నట్టు వచ్చిన వార్తలు కూడా కొంత సానుకూలంగా మారాయి. ఇస్తాంబుల్‌లో మూడు గంటల పాటు జరిగిన చర్చలు.. కొంత సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ అంశం కూడా మదుపరులను కొనుగోళ్ల వైపు పరుగులు పెట్టేందుకు సహకరించింది. కొన్ని రోజుల క్రితం వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరిన చమురు ధరలు.. కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. సోమవారం 10 డాలర్లు పడిపోయిన బ్యారెల్‌ చమురు ధర ప్రస్తుతం 110 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement