Thursday, April 25, 2024

Telangana | బడ్జెట్‌ సమావేశాలు షురూ, రేపటి నుంచి ప్రి-బడ్జెట్‌.. త్వరలో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించి ఆర్ధిక యేడాది బడ్జెట్‌ కూర్పు వేగవంతం చేసేలా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 13 వరకు అన్ని శాఖలనుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ఆర్ధిక శాఖ ఇక శాఖల వారీగా ప్రి బడ్జెట్‌ సమావేశాలకు షెడ్యూల్‌ వెల్లడించింది. బుధవారంనుంచి వరుసగా శాఖల వారీగా బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటలనుంచి 11.30 వరకు పంచాయతీరాజ్‌, 11.30గంటలనుంచి 12 వరకు మున్సిపల్‌ శాఖ., 12.నుంచి 12.30 వరకు పశుసంవర్ధక శాఖ, 12.30నుంచి ఒంటిగంట వరకు రవాణ, ఆర్‌ అండ్‌ బీ, ఒంటిగంట నుంచి 1.30గంటల వరకు రెవెన్యూ, దేవాదాయ శాఖలు ఇలా సాయంత్రం 5.30గంటలనుంచి 6 గంటల వరకు ఫైనాన్స్‌ ప్లానింగ్‌ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశాలు జరగనున్నాయి.

శాఖాధిపతులు, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు బడ్జెట్‌ ప్రతిపాదనలు, అంచనాలు, గతంలో కేటాయింపులు, చేసిన వ్యయాలు, పురోగతిలో ఉన్న పథకాలు, ఇంకా పెంచాల్సిన నిధులు, వృధా, నియంత్రణల వంటి అనేక అంశాలపై కూలంకషంగా చర్చించనున్నారు. ఈ ప్రతిపాదనలపై చర్చ అనంతరం త్వరలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు సమావేశం నిర్వహించి ఫైనల్‌ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నివేదించనున్నారు.

పూర్తిస్థాయి బడ్జెట్‌ దిశగానే…
2023-24 ఆర్ధిక ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ దిశగానే ఆర్ధిక శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది. గత శుక్రవారంనాటికే అన్ని శాఖల ప్రతిపాదనలు ఆర్ధిక శాఖకు చేరారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధాన్యత దక్కనుందని తెలుస్తోంది. దళితబంధు వంటి పథకాలకు భారీగా నిధులను కేటాయించేలా కార్యాచరణ చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే కొత్త పథకాలు, వ్యవసాయ ప్రాధాన్యత, సంక్షేమ రంగాలకు కీలక స్థానం దక్కనుంది. కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చేలా ఇరిగేషన్‌ శాఖ కీలక కసరత్తు చేస్తోంది.,

సీతారామా, డిండి, పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు నిధులు కోరనున్నట్లు సమాచారం. డిసెంబర్‌ నాటికి సమకూరిన నిధులు, రాబడులు, వ్యయాల ప్రాతిపదికన అంచనాలు రూపొందిస్తున్నారు. కేంద్ర సాయాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, సీఎస్‌ఎస్‌, జీఎస్టీ సాయాలు ఫిబ్రవరి 1న స్పష్టత రానున్నాయి.

- Advertisement -

ఇరిగేషన్‌కే ప్రాధాన్యం…
ఇరిగేషన్‌ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్‌ వరుసగా ఈ ఏడాది కూడా నిధుల కేటాయింపులో సింహభాగం ఈ శాఖకే ఇవ్వనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు రైతుబంధు, రైతుబీమాలతో ఎక్కువ నిధుల అవసరం కానుంది.. ఈ మేరకు ఈ శాఖకు రూ. 25వేల కోట్లకుపైగా కేటాయింపుల ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది.

ఇప్పటికే 2023-24 వార్షిక బడ్జెట్‌ కూర్పు మొదలుకాగా, తాజాగా ప్రి బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు నేడు జరగనున్నాయి. గతేడాది ఆదాయాలు, వ్యయాలు, అంచనాలను అధికారులు సమగ్ర వివరాలతో, మూస పద్దతిలో కాకుండా సహేతుక పద్దతిలో బడ్జెట్‌ లెక్కలు సిద్దం చేస్తున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఆయాశాఖలలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వ#హణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలన్న ఆర్థికశాఖ అంచనాలు వాస్తవికతతో ఊహాజనిత, సాంప్రదాయ పద్దతిలో అంచనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇప్పటికే కేటాయించిన పోస్టుల్లో 2023-24లో కొత్తగా చేరే ఉద్యోగుల సంఖ్య, అందుకు అనుగుణంగా పెరగనున్న వేతనాలతో అంచనాలు రూపొందిస్తున్నారు. త్వరలో డీఏ, పీఆర్‌సీ ప్రకటిస్తే ఇందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చే ఆర్ధికపరమైన సాయాలు, ఇతర అంశాలపై ఫిబ్రవరి 1న స్పష్టత రానుంది. అయితే కేంద్ర వనరులు, గ్రాంట్లు, సాయాలపై ఆధారపడకుండా సొంత వనరుల ఆదాయంపైనే సర్కార్‌ దృష్టిసారించి బడ్జెట్‌ పద్దులను, బడ్జెట్‌ సైజును పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా శాఖల వారీగా విస్తృత కార్యాచరణ మొదలైంది. ఈ ఏడాదిలో శాసనసభా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులను కేటాయించేలా సీఎం కేసీఆర్‌ ఆర్ధిక శాఖను ఆదేశించినట్లు తెలిసింది. పన్నులు, పన్నేతర ఆదాయాలపై 20శాతంమేర అంచనాలను పెంచుకునేందుకు కీలక కార్యాచరణ ముమ్మరం చేసింది.

వచ్చే ఆర్ధిక ఏడాది (2023-24)లో సంక్షేమ పథకాలకు భారీగా వ్యయాలు, అందుకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబీమా, విద్యుత్‌ సబ్సిడీలు, విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, కేసీఆర్‌ కిట్‌, షాదీముబారక్‌, కళ్యాణక్ష్మి, కొత్త ఇంటి పథకంతోపాటు ఇతర అనేక పథకాలకు భారీగా నిధుల సమన్వయం, సర్దుబాటు తప్పనిసరి కానుంది. శాఖల వారీగా ఇప్పటి వరకు నిధుల వ్యయం, ఇంకా పెండింగ్‌లు, పథకాల వారీగా కావాల్సిన మొత్తాలు, ఈ ఆర్ధిక ఏడాది చివరకు ఇంకా ఎంత మొత్తం తప్పనిసరి పథకాలు, వ్యయాలు ఖర్చులు ఉన్నాయనే కోణంలో సమగ్రంగా సమీక్షించనుంది.

ప్రస్తుత ఏడాది రూ. 50వేల కోట్లు లోటు…
దేశవ్యాప్తంగా పన్నుల వసూళ్ళు భేషుగ్గా ఉన్నప్పటికీ కేంద్ర కావాలనే రాష్ట్రానికి రావలసిన నిధుల్లో భారీగా కోత విధించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన పన్నుల వాటాలో 80శాతం తగ్గిందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్రానికి రావలసిన గ్రాంట్ల మొత్తంలో తగ్గుదల భారీగా ఉందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇప్పటివరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు 20శాతానికి మించలేదు. అక్టోబర్‌ నాటికి కేంద్రంనుంచి రావాల్సిన నిధుల్లో పన్నుల వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు రూ. 59వేల కోట్లు అంచనా వేసుకోగా, కేవలం రూ. 11వేల కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

ఏడు నెలల్లో కేంద్ర పన్నుల వాటాకింద రూ. 5911కోట్లు, ఇక గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు రూ. 41వేల కోట్లు అంచనాకుగానూ రూ. 5592కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ అంచనాలు గతి తప్పుతున్నాయి. ఇలా రకరకాలుగా బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రాబడులు, ఆదాయాలపై ప్రస్తుత ఆర్ధిక ఏడాదిలో రూ. 50వేల కోట్లు లోటు ఏర్పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అన్ని రకాల పెండింగ్‌ నిధులు కలుపుకుని ఈ ఏడాదికి కేంద్రం నుంచి ఇంకా రూ.35 వేల కోట్లు తెలంగాణ రావాల్సి ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

పెరుగుతున్న లబ్దిదారులతో మరింత భారం…
రైతు రుణమాఫీ, రైతుబంధులలో కొత్త లబ్దిదారులతో పాటు కొత్తగా సామాజిక పించన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడనుంది. ఇప్పటివరకు లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి తాజా విపత్కర పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి.
ఇప్పటికే కార్పొరేషన్ల పేరుతో చేసిన గ్యారంటీ అప్పులను నిలిపివేయగా తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నిధుల సమన్వయం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తీమద సాముగా మారింది. ఇంతటి విషమ సమయంలో ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయకుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్ధిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement