Friday, April 19, 2024

మరాఠీల గడ్డపై గులాబీల బి ఆర్ ఎస్ ‘మహా’సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఆర్‌ఎస్‌, భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)గా ఆవిర్భవించిన అనంతరం పొరుగు రాష్ట్రంలో తొలి సభకు సమయం ఆసన్న మైంది. ఖమ్మంలో ఇటీవలే భారీ స్థాయిలో తొలి సభ నిర్వహించిన బీఆర్‌ఎస్‌ రెండో సభను మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సభకు చేరికల సభగా పార్టీ నామకరణం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. నాందేడ్‌లో ఆదివారం జరిగే చేరికల సభలో కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెంందిన సీనియర్‌ రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. సభకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ తదితరులు సభ ఏర్పాట్లు, నిర్వహణ, పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యం లోనే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాందేడ్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను కలుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నాందేడ్‌ సభా ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలిం చారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలిసి సభ ఏర్పాట్లపై నిర్వాహకులను అడిగి తెలుసు కున్నారు. సభ వేదిక, వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. నాందేడ్‌ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సభకు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్మల్‌ జిల్లా సరిహద్దు ప్రాంతం నాందేడ్‌ సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. నాందేడ్‌ జిల్లాలో అనేక గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే బాగుంటుంందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement