Saturday, April 20, 2024

దేశ సమైక్యతకు బీఆర్‌ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో కృషి చేస్తోంది – దాస్యం వినయ్ భాస్కర్

ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి గమ్యాన్ని ముద్దాడి, నేడు సమాఖ్య స్ఫూర్తితో దేశ సమైక్యతకు భారత్ రాష్ట్ర సమితిగా అధినేత కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ దుందుడుకు విధానాలపై పలు కార్యక్రమాల ద్వారా దేశ వ్యాప్తంగా వ్యతిరేకంగా పోరాటం చేస్తామ‌న్నారు. పేద ప్రజలపై మోతల వాతలు పెడుతూ… కార్పొరేట్ శక్తులకు 14 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర బీజేపీది అన్నారు. కర్షక,కార్మిక లోకం ఉసురు పోసుకుంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు ఇంటికి పంపుతారన్నారు. తెలంగాణలో బిజెపి వదిలిన బాణాలు గురితప్పి తిరుగుతున్నాయ‌ని, ఆంధ్రా యాత్రికులు తెలంగాణలో విషయాత్రలు చేస్తే సరిహద్దు వరకు తరిమి తన్నడం ఖాయం అన్నారు. రాష్ట్రంపై అర్ధ రహిత, ఉచిత సలహాలు అందిస్తున్న ఆంధ్రా వైసీపీ నాయకుల వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం అన్నారు. దీక్షా – దివస్ ఉత్సవాలలో భాగంగా ముగింపు కార్యక్రమం “విజయ్ దివస్” సభను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంద‌న్నారు. తేదీని మరల ప్రకటించడం జరుగుతుందని చీఫ్ విప్ హనుమకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర రైతు ఋణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, నయిముద్దీన్,కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement