Thursday, April 18, 2024

అదానీపై పట్టు వీడని బీఆర్‌ఎస్ – మెట్టు దిగని కేంద్రం.. ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై కేంద్రం మెట్టు దిగట్లేదు. బీఆర్‌ఎస్ పట్టు వీడట్లేదు. విపక్ష ఎంపీలు జేపీసీకి డిమాండ్ చేయడంతో ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అదానీ వ్యవహారంపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆ పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పార్లమెంట్ నుంచి నడుచుకుంటూ వెళ్లి విజయ్ చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. మోదీ డౌన్ డౌన్… కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పార్లమెంట్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తోందని ఆరోపించారు. చర్చకు అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు.

- Advertisement -

ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు నిత్యం పార్లమెంట్ లోపల, బయట శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం నిస్సిగ్గుగా వ్యవహరించడం దారుణమన్నారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదికి ఉసిగొల్పుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబటారు. కేంద్రం దుర్నీతిని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని నామ జోస్యం చెప్పారు. కోట్లాది మంది తమ కష్టార్జితాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దాచుకున్నారని, ఇప్పుడా డబ్బుకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా అంశాలపై చర్చించాలని రోజూ తాము ఇస్తున్న వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశం కాగానే విపక్షాలు నినాదాలు చేయడంతో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement