Friday, April 19, 2024

Telangana | వీ6 చానల్​, వెలుగు పత్రికలపై నిషేధం.. ఆ చానల్​ డిబేట్లకు హాజరుకావొద్దన్న బీఆర్​ఎస్​ పార్టీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా.. బీజేపీకి సపోర్ట్​గా వార్తలు, కథనాలు ప్రచురిస్తున్న తెలుగు వార్తా చానల్ V6, వెలుగు వార్తా పత్రికలను భారత రాష్ట్ర సమితి (బీఆర్​ఎస్​) నిషేధించింది. ఆ మీడియా సిబ్బందిని పార్టీ విలేకరుల సమావేశాలకు హాజరుకాకుండా నిషేధిస్తూ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. చానల్ డిబేట్‌లు, చర్చల్లో బీఆర్​ఎస్​ లీడర్లు ఎవరూ పాల్గొనవద్దని కూడా పార్టీ తన నేతలను కోరింది. ఇదే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యల తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ నేత క్రిశాంక్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీసినందుకు, భారతీయ జనతా పార్టీకి (బిజెపి) మద్దతు ఇస్తున్నందుకు వీ6 చానెల్, వెలుగు వార్తాపత్రికలను నిషేధించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందన్నారు. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలు బీజేపీకి జేబు సంస్థలుగా మారి బీఆర్‌ఎస్‌పై, తెలంగాణ రాష్ట్రంపై అసత్యాలు, బూటకపు కథనాల రూపంలో విషం చిమ్ముతున్నాయన్నారు. ఈ నేపధ్యంలో BRS పార్టీ విలేఖరుల సమావేశాలకు V6 చానల్, వెలుగు వార్తాపత్రిక హాజరుకాకూడదని BRS పార్టీ నిర్ణయించిందన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తమ పార్టీ కేడర్‌ను రెండు మీడియా సంస్థల వేదికలపై చర్చలకు హాజరుకావద్దని కోరారు. ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలని బీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణ ప్రజలను కోరింది.

అయితే.. గతంలోనూ తమ పార్టీపై విషపు రాతలు రాస్తున్నారన్న కారణంగా బీజేపీ కూడా నమస్తే తెలంగాణ, టీ న్యూస్​ చానల్​ని నిషేధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా ట్విట్టర్​లో వీ6 చానల్​, వెలుగు పత్రికల్లో వస్తున్న కథనాలు, అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ వీడియోలను పోస్టు చేసింది. ఏది వాస్తవం, ఏది నిజం.. వెలుగులో వచ్చిన కథనం అబద్ధం.. అసలు నిజం ఇదీ అని.. వీడియోలతో సహా ప్రజలకు ముందుకు తీసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement