Friday, April 19, 2024

Big Story | దూకుడు పెంచిన గులాబీ.. రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌తో బీఆర్‌ఎస్‌ అలర్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధికార పార్టీ దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌ కావడం, రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ నెలకొనడంతో వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్ర నాయకత్వాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే అన్ని జిల్లాలకు బిఆర్‌స్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సమన్వయ కర్తలను నియమించారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు చెదిరిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందర్నీ ఏకం చేసి ఒకతాటిపై నడిచేలా సమన్వయ కర్తలతో ముందుకు వెళ్లాలని డిసైడ్‌ అయ్యారు.

ఆత్మీయ సమ్మేళనాలు, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ సభలు, విద్యార్థి విభాగం కార్యక్రమాలను వచ్చే మూడు నాలుగు నెలల పాటు విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. మొన్న పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో సమన్వయ కర్తల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సమన్వయ కర్తల బృందం జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాల అమలును సమన్వయం చేయనున్నారు. అయితే వెంటనే బాధ్యతలు చేపట్టాలని సమన్వయ కర్తలకు తెలియజేశారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై పార్టీ కార్యక్రమాలు, ప్రణాళికల అమలుపై చర్చించాలని కేటీఆర్‌ సూచించారు.

- Advertisement -

సమన్వయ కర్తలతోనే ఎలక్షన్స్‌ ముగిసే వరకు ముందుకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయని నేతలకే ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా సమాచారం. అనుభవం కలిగిన లీడర్లు, పార్టీలోని అంతర్గత గొడవలను సద్దుమనిగేలా చేసే వారికే ప్రధాన్యం ఇచ్చినట్లు పార్టీ నేతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు నయా ప్లాన్స్‌ను అమలు చేస్తున్నారు. రాబోయే కొద్ది నెలల్లో పలు పార్టీ కార్యక్రమాలు ఉండనున్నట్లుగా బిఆర్‌ఎస్‌ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ధర్నాలు, ఆందోళనలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టున్నట్లుగా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

సమన్వయకర్తలు వీళ్లే..

కొంత మంది నేతలను రెండు జిల్లాలకు సమన్వయ కర్తగా బాధ్యతలను అప్పగించారు. ఎక్కువ శాతం ఒక్క జిల్లానే కేటాయించారు. వనపర్తి, జోగులాంబ గద్వాలకు-తక్కళ్లపల్లి రవీందర్‌ రావు, మేడ్చల్‌-పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల-బస్వరాజు సారయ్య, నల్గొండ-కడియం శ్రీహరి, వికారాబాద్‌-పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి-ఎల్‌ రమణ, భద్రాద్రి కొత్తగూడెం-భాను ప్రసాద్‌, సంగారెడ్డి-వెంకట్‌ రామ్‌ రెడ్డి, మెదక్‌-ఎగ్గే మల్లేషం, మహబూబ్‌ నగర్‌ , నారాయణపేట-కసిరెడ్డి నారాయణ రెడ్డి, యాదాద్రి భువనగిరి-యాదవ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌-పట్నం మహేందర్‌ రెడ్డి, భూపాలపల్లి, ములుగు-అరికెల నర్సారెడ్డి, సిద్దిపేట-బోడకుంట్ల వెంకటేశ్వర్లు, హన్మకొండ, వరంగల్‌-ఎమ్‌.ఎస్‌ ప్రభాకర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌-వి. గంగాధర్‌ గౌడ్‌, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌-నారదాసు లక్ష్మణ్‌, జనగామ-కోటిరెడ్డి, మహబూబాబాద్‌-పురాణం సతీష్‌, కామారెడ్డి-దండె విఠల్‌, నిజామాబాద్‌-బండ ప్రకాష్‌, జగిత్యాల-కోలేటి దామోదర్‌, పెద్దపల్లి-ఎర్రోళ్ల శ్రీనివాస్‌, హైదరాబాద్‌-దాసోజు శ్రావణ్‌, ఖమ్మం-శేరి సుభాష్‌ రెడ్డి, సూర్యాపేట-మెట్టు శ్రీనివాస్‌. ప్రధానంగా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, విప్‌లతో పాటు పార్టీ నేతలకు సమన్వయ కర్తలుగా పదోన్నతులను కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement