న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) – భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మధ్య లిక్కర్ బంధం బయటపడిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన… ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించిన అంశంపై ఆయన స్పందిస్తూ.. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చారించారు.
రెండు పార్టీలకు చెందిన కీలక వ్యక్తులు కలిసి కుంభకోణం ఎలా చేశారో, వచ్చిన సొమ్మును గోవా ఎన్నికల్లో ఎలా ఖర్చు చేశారో సవివరంగా చార్జిషీటులో పొందుపరిచారని వెల్లడించారు. ఈ అనుబంధంతోనే ఖమ్మంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హాజరయ్యారని డా. లక్ష్మణ్ అన్నారు. ఇదంతా చూస్తుంటే దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
మహిళలపై బీఆర్ఎస్ తీరు ఎలా ఉందంటే…
భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన-ఆదివాసీ ఆడబిడ్డను భారత రాష్ట్రపతిని చేసి, ఒక తెలుగింటి కోడలు నిర్మల సీతారామన్‌తో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే భారత రాష్ట్ర సమితి ఒక మహిళా గవర్నర్‌నే సహించలేకపోతోందని డా. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారని, మహిళల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎలా వ్యవహరిస్తున్నాయో ఈ ఉదంతాలే నిదర్శనమని అన్నారు. ఇక బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఆర్థిక సవాళ్ళను, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేక వర్గాల మెప్పు పొందుతోందని కొనియాడారు.
ముందు చూపుతో భారతదేశం తీసుకున్న చర్యలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని తెలిపారు. బడ్జెట్ కత్తిమీద సాము లాంటిదని, అయినప్పటికీ అన్ని వర్గాలకు ప్రయోజనాలు కల్పించేలా కేంద్రం రూపొందించిందని అన్నారు. సమీప భవిష్యత్తులో ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు.