Thursday, March 28, 2024

WPL | ముంబై జోరుకు బ్రేక్‌.. ఉత్కంఠ పోరులో యూపీ విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యుపిఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ అద్భుతం చేసిచూపింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అతికష్టం మీద ఛేదించింది. 19.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్‌ (38), గ్రేస్‌ హారిస్‌ (39) బ్యాటింగ్‌లో రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్‌ రెండు వికెట్లు, బ్రంట్‌, హేలీ మాథ్యూస్‌, వాంగ్‌ తలో వికెట్‌ తీశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది.

- Advertisement -

లక్ష్యఛేదన ప్రారంభించిన యూపీకి ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తరిగింది. ఓపెనర్‌ దేవికా వైద్య 1 నిరాశ పరిచింది. మరోఓపెనర్‌ హేలీ కూడా (8) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన మెక్‌గ్రాత్‌, నవ్‌గిరే (12) జోడీ కూడా ఎక్కువసేపు నిలబడలేదు. జట్టు స్కోరు 27 పరుగుల వద్ద నవ్‌గిరే భారీ షాట్‌కు ప్రయత్నించి భాటియాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత హారిస్‌తో కలిసి మెక్‌గ్రాత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. 16వ ఓవర్‌లో ఈ జోడీని కేర్‌ విడగొట్టింది. ఈ దశలో దీప్తిశర్మ (13నాటౌట్‌), సోఫీ (16నాటౌట్‌) అతికష్టం మీద లక్ష్యాన్ని ఛేదించి ముంబైకి షాకిచ్చారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ను యూపీ వారియర్స్‌ బౌలర్లు నిలువరించారు.. పటిష్టమైన ముంబై జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. దీంతో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ హీలీ మాథ్యూస్‌ (35), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (25), వాంగ్‌ (32) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరును చేయలేక పోయారు. యాస్తికా భాటియా(7), నాట్‌ స్కివెర్‌ (5), అమేలీ కెర్‌ (3),అమన్‌జోత్‌ కౌర్‌ (5), హమైరా కాజీ (4), ధారా గుజ్జర్‌ (3) కలిత (3 నాటౌట్‌) పేలవ ప్రదర్శన జట్టును నిరాశపరించింది. అగ్రశ్రేణి బ్యాటర్లున్న ముంబై ఇండియన్స్‌కు కళ్లెం వేయడంలో యూపీ వారియర్స్‌ బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌ (3/15) కీలక పాత్ర పోషించింది. ప్రధాన బ్యాటర్లను వెంటవెంటనే ఔట్‌చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. మరోవైపు రాజేశ్వరి గైక్వాడ్‌ (2), దీప్తిశర్మ (2) అంజలి శర్వాని (1) రాణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement