Thursday, April 18, 2024

ప్రైవేటీకరణకు బ్రేక్‌లు.. ఈ సారి బడ్జెట్‌లో లక్ష్యం తగ్గే అవకాశం

కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కానుంది. ఎన్నికల సంవత్సరం ముందున్నందున ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం గతంలా దూకుడుగా వెళ్లకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
గతంలో ప్రభుత్వాలు జాతయికరణ, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ప్రజాధనంలో మహా సంస్థలుగా ఎదిగిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను వరసబెట్టి ప్రైవేటీకరిస్తూ వస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తూ వస్తున్నారు. ప్రారంభంలో నష్టాల్లో ఉన్న సంస్థలనే ప్రైవేటీకరించిన ప్రభుత్వాలు, తాజాగా అత్యధిక లాభాల్లో ఉంది నవరత్న హోదా పొందిన ప్రతిష్టాత్మక సంస్థలను సైతం ప్రైవేటీకరించడం, పెట్టుబడులను ఉపసంహరించడం చేస్తున్నారు.

సరళీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత ఈ స్థాయిలో ప్రభుత్వ సంస్థలను తెగనమ్మడం మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో దూకుడుగా చేస్తున్నారు. దీంతో దేశంలో విపక్షాలతో పాటు, కార్మిక సంఘాలు సైతం నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. సరళీకరణ స్థానంలో ప్రభుత్వం బేచో ఇండియా కార్యక్రమాన్ని చేపట్టిందని ఘటుగా విమర్శలు చేస్తున్నాయి.

- Advertisement -

ఈ సారి మాత్రం గతంలోగా ప్రభుత్వం ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో అంత దూకుడు ప్రదర్శించకపోవచ్చని భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సమీకరించే నిధుల లక్ష్యాన్ని 50 వేల కోట్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా విక్రయించడం, లేదా ప్రభుత్వ వాటాలను తగ్గించుకోవడం పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంస్థలను పూర్తిగా విక్రయించింది. ఎల్‌ఐసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కొంత మేర పెట్టుబడులను ఉపసంహరించింది.

వ్యాపారం చేయడం ప్రభుత్వ పనికాదని ప్రధాని స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ఆయన స్పష్టం చేశారు. వ్యూహాత్మకం కాని రంగాలకు చెందిన సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యూహాత్మక సంస్థల్లో వాటాలను తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటామిక్‌ ఎనర్జీ, స్పేస్‌, డిఫెన్స్‌, ట్రాన్స్‌పోర్టు, టెలీ కమ్యూనికేషన్‌, పవర్‌, పెట్రోలియం, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఇతర ఆర్ధిక సేవల విభాగాలను ప్రభుత్వం వ్యూహాత్మక రంగాలుగా ప్రకటించింది. వీటిలో కొంత మేర ప్రభుత్వ జోక్యం ఉంటుందని తెలిపింది.

నెరవేరని టార్గెట్‌..

పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. బడ్జెట్‌లో భారీ అంచనాలు ప్రకటించిన ప్రభుత్వం, ఆ మేరకు లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 65 వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 31 వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సమీకరించింది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలో ఇది సగం మాత్రమే. ఇందులో ఒక్క ఎల్‌ఐసీలో వాటాల విక్రయం ద్వారానే 20,516 కోట్లు వచ్చాయి. ఓఎన్‌జీసీలో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్ల విక్రయం ద్వారా 3,058 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్లో స్పెసిఫైడ్‌ అండర్‌టేకింగ్‌ ఆఫ్‌ ది యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా వాటా విక్రయించడం ద్వారా 3,839 కోట్లు వచ్చాయి. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తవడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ గడువులోగా లక్ష్యాన్ని సాధించడం అంత తేలికకాదు.

ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ప్రారంభమైన ఐడీబీఐ బ్యాంక్‌ పూర్తి ప్రైవేటీకరణ ప్రక్రియ 2023లోకాని పూర్తికాదు. 2021-22 బడ్జెట్‌లోనూ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా 1.75 లక్షల కోట్లు సేకరించాలని భారీ లక్ష్యం పెట్టుకున్నారు. తరువాత కాలంలో దీన్ని 78 వేల కోట్లకు సవరించారు. వాస్తవంగా ఆ ఆర్ధిక సంవత్సరంలో వచ్చింది మాత్రం కేవలం 13,531 కోట్లు మాత్రమే.

ఎన్నికల సంవత్సరం..

2024లో జనరల్‌ ఎన్నికలు జరగనున్నాయి. అందు వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ అవుతుంది. జనరల్‌ ఎన్నికలకు ముందు 9 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ప్రభుత్వం ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ విషయంలో నెమ్మదించే సూచనలు ఉన్నాయి. విపక్షాలు ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని ద్వంసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నందున ఈ సారి లక్ష్యం 50 వేల కోట్లలోపుగానే ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంత కాలంగా జీఎస్టీ వ సూళ్లు 1.4 లక్షల కోట్లకు తగ్గడం లేనందున నిధులకు సమస్య ఉండదని భావిస్తున్నారు.

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణపై…

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ద్రవ్యోల్బణం పెరుగుదలలో చమురు ధరలది కీలక పాత్ర. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్‌ పె ట్రోలియం కార్పొరేషన్‌ను ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈ సమయంలో దీన్ని విక్రయించడం అంత మంచిదికాదని ప్రభుత్వం భావిస్తోంది. బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి 53 శాతం వాటా ఉంది. దీన్ని పూర్తిగా విక్రయించాలని మోడీ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది.

కార్మిక సంఘాల వ్యతిరేకత..

నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ, పెట్రోలియం సంస్థలు, ఇలా అనేక ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అమ్మడం, వాటాలను ఉపసంహరించడం వంటి చర్యలను కార్మిక సంఘాలు ప్రతిఘటిస్తున్నాయి. ఆరెస్సెస్‌కు చెందిన స్వేదేశ్‌ జాగరణ్‌ మంచ్‌ కూడా మోడీ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తోంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను, ఒక బీమా సంస్థను పూర్తిగా విక్రయిస్తామని గతంలో ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఇందులో ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను పిలిచారు. మిగిలిన సంస్థలు ఏంటన్నది ఇంకా తేలాల్సి ఉంది. విశాఖ ఉక్కును సైతం పూర్తిగా విక్రయిస్తామని ఆర్ధిక మంత్రి చేసిన ప్రకటనపై రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. తీవ్ర ప్రతిఘటన మూలంగానే ప్రభుత్వం ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement