Friday, March 29, 2024

రాష్ట్రపతి ప్రసంగం బాయ్‌కాట్.. బీఆర్ఎస్, ఆప్ తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన రాష్ట్రపతి ప్రసంగాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బహిష్కరించడాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తప్పుబట్టింది. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో ప్రసంగం చేయడం చారిత్రాత్మక దినమని, అలాంటి మహా ఘట్టాన్ని బహిష్కరించడం అంటే గిరిజనులను, మహిళలను అవమానించడమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తితో కూడా రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్, బీఆర్ఎస్ నేతలు మహిళలకు, గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏలుబడిలో మహిళలకు గౌరవం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నర్‌కు గుర్తింపు, గౌరవం లేదని, ఇప్పుడు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతికి కూడా గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. గవర్నర్లతో ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తుందని ప్రశ్నించారు. తమ అవినీతి వ్యవహారాలను కప్పిపుచ్చుకోవడం కోసం, జనం దృష్టిని మళ్ళించడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీల ఆల్కహాల్ అనుబంధం దేశ ప్రజలందరికీ తెలుసని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ పాలకుల కుటుంబం వరకు లింకులు ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కలిసి ‘నేషనల్ ఆల్కహాల్ అలయన్స్’ అని పేరు పెట్టుకుంటే మంచిదని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement