Friday, April 19, 2024

Delhi: బీజేపీలో రేపు చేరనున్న బూర నర్సయ్య.. తరుణ్‌ చుగ్‌తో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రానికి అసలు తల్లి ప్రేమను తీసుకొస్తామని మాజీ ఎంపీ (భువనగిరి) డా. బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. బుధవారం కాషాయ కండువా కప్పుకోనున్న నేపథ్యంలో ముందుగా చుగ్‌తో కలిసి మాట్లాడారు. బూర నర్సయ్యతో పాటు మరికొందరు నేతలు హరిశంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తరుణ్ చుగ్‌తో భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బూర.. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి నోళ్లు మూతపడ్డ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెన్నులో సిరాకు బదులుగా రక్తంతో ఉద్యమాన్ని నడిపించిన జర్నలిస్టులు ఓవైపు, వైద్య వృత్తిలో ఉన్న తామంతా మరోవైపు.. ఇలా అందరూ కలసికట్టుగా ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో సాధించుకున్న రాష్ట్రంలో ఎంపీగా పనిచేసినంత కాలం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రుల సహాకారంతో తన నియోజకవర్గానికి అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించానని తెలిపారు. తెలంగాణపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శిస్తున్నారని, కానీ ఇప్పుడు అసలు తల్లి ప్రేమేంటో చూపిస్తామని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. తరుణ్ చుగ్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి గురించే చర్చించినట్టు ఆయన వెల్లడించారు.

తెలంగాణపై తపన కల్గిన అందరూ ఏకమవుతన్నారు: తరుణ్ చుగ్
తెలంగాణ రాష్ట్రం కోసం తపన పడే వ్యక్తులందరూ ఒక్కటవుతున్నారని, అలాంటివారందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. డా. బూర నర్సయ్య గౌడ్‌ తెలంగాణ కోసం, దేశం కోసం తపనపడుతూ ఉంటారని ఆయనన్నారు. సర్జన్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన డా. బూర నర్సయ్య, మురికిని శుభ్రం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. బంగారు తెలంగాణ కోసం కలలు కన్నారని, కానీ ఆ కలలను చోరీ చేసిన సీఎం కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజల్లో ఏ ఒక్కరి కలను కూడా సాకారం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించలేదని తరుణ్ చుగ్ విమర్శించారు. లోటు బడ్జెట్ పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, పథకాలు నిలిచిపోతున్నాయని ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి కూడా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అనేకవర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలన, కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement