Saturday, June 12, 2021

కరోనా విరాళాల కోసం.. ఆనంద్‌తో చెస్ ఆడనున్న అమీర్‌ఖాన్

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా విరాళాలు సేక‌రించ‌డానికి బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్‌.. చెస్ మాజీ వ‌రల్డ్ ఛాంపియ‌న్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌తో ఓ గేమ్ ఆడనున్నాడు. ఈ నెల 13న సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల మ‌ధ్య ఈ గేమ్ జ‌ర‌గ‌నుంది. చెస్‌.కామ్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ గేమ్‌ను ప్ర‌త్యక్ష ప్ర‌సారం చేస్తున్న‌ట్లు చెస్‌.కామ్ త‌న ట్విట‌ర్‌లో ప్ర‌క‌టించింది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఆ క్ష‌ణం వ‌చ్చేసింది. చెస్ ల‌వ‌ర్ అయిన‌ సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్‌, మాజీ వ‌రల్డ్ ఛాంపియ‌న్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌తో ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ఆడ‌నున్నాడు. ఈ ఈవెంట్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి అని ట్వీట్ చేసింది.

గ‌తంలోనూ ఈ ఇద్ద‌రూ చెస్ ఆడిన ఫొటోను ఈ ట్వీట్ కామెంట్స్‌లో ఓ అభిమాని షేర్ చ‌శాడు. ఈ గేమ్ అద్భుతంగా సాగ‌బోతోంద‌ని ప‌లువురు అభిమానులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ఈవెంట్‌కు ‘చెక్‌మేట్ కోవిడ్’ అనే పేరు పెట్టారు. కరోనాతో బాధ‌ప‌డుతున్న చెస్ ప్లేయ‌ర్స్‌, వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు ఈ డ‌బ్బును అందించ‌నున్నారు. అమీర్‌ఖాన్‌తో పాటు ఆ రోజు మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు కూడా ఆనంద్‌తో చెస్ ఆడ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News