Thursday, April 25, 2024

పుతిన్‌ ఆరోగ్యంపై నీలినీడలు.. వణుకుతున్న చేతులు,  స్థిరంగా నిలబడలేని కాళ్లు

ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యక్తిగత జీవితంపై అంతర్జాతీయ సమాజం దృష్టిసారించింది. ఈ సందర్భంలో ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించడానికి అనేక వార్తా సంస్థలు ప్రయత్నించాయి. పుతిన్‌ బాడీ లాంగ్వేజ్‌, ఇటీవల బహిరంగ సభల్లో ప్రసంగించిన తీరును పలువురు ఆరోగ్య నిపుణులు విశ్లేషించారు. పుతిన్‌ చేతులు వణుకుతుండటాన్ని, ముఖానికి సౌందర్య చికిత్స జరిగినట్లు కనిపించడాన్ని ప్రస్తావించారు. దేశంలోని ఒలింపిక్‌ అథ్లెట్లకు అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చినప్పుడు రష్యా అధ్యక్షుడు ఉబ్బినట్లు కనిపించారని న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదించింది. మేరియుపోల్‌లో సైనికచర్య గురించి రక్షణమంత్రి సెర్గీతో భేటీ అయినప్పుడు, పుతిన్‌ టేబుల్‌ను పట్టుకుని ఉన్నారు. మాట్లాడే సమయంలో కుడికాలును పదేపదే నేలను తాకించారు.

పైగా కుర్చీలో నిటారుగా కూర్చోలేక పోయారు. శక్తిహీ నుడైన వృద్ధుడి మాదిరిగా కనిపించారు. బెలారస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ లుకాషెంకోను కలిసినప్పటి మరొక వీడియోలో.. వణుకుతున్న చేతులను ఛాతీకి దగ్గరగా పెట్టుకున్నట్లు కనిపించింది. నడుస్తున్నప్పుడు తడబాటు, కాళ్లు స్థిరత్వాన్ని కోల్పోయిన సంకేతాలు కనిపించాయి. ట్విట్టర్‌లోని చాలా మంది వినియోగదారులు పుతిన్‌కు నాడీ వ్యవస్థ రుగ్మత అయిన పార్కిన్సన్‌ సోకిందని భావించారు. అయితే, వైట్‌ హౌస్‌ మాత్రం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి కామెంట్‌ చేసేందుకు నిరాకరించింది. పుతిన్‌ వయసు ఇప్పుడు 69 ఏళ్లు. 1999లో రష్యా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, మరుసటి ఏడాది నుంచి అధికారికంగా అధ్యక్షుడయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement