Thursday, April 25, 2024

దూసుకెళ్లిన జిర్కాన్‌! బాహుబలి క్షిపణిని పరీక్షించిన రష్యా..

మాస్కో:ప్రపంచంలోనే అత్యాధునిక, గరిష్ఠ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాహుబలి క్షిపణి జిర్కాన్‌ను రష్యా విజయవంతంగా ప్రయోగించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. వెయ్యి కి.మి. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తాగల ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణిని శనివారం రష్యా ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బారెంట్స్‌ సముద్రంలో మోహరించిన యుద్ధనౌక అడ్మిరల్‌ గోర్షకోవ్‌ నుంచి దీనిని ప్రయోగించారు. గంటకు 6670 కి.మి. వేగంతో దూసుకువెళ్లిన జిర్కాన్‌ శ్వేతసముద్రంలో 625 కి.మి. దూరాన ఉన్న లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఈ బాహుబలి క్షిపణిని ప్రయోగించినవెంటనే నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకువెళ్లిన దృశ్యాలను రష్యా ప్రపంచానికి అందించింది. అమెరికాలోని అనేక నగరాలు సహా పశ్చిమ దేశాల్లోని లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో వీటిని రూపొందించారు. ఉక్రెయిన్‌పై ఓ పక్క యుద్దం జరుగుతున్నప్పటికీ ఈ జిర్కాన్‌ క్షిపణుల తయారీకి అత్యంత ప్రాధాన్యమిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కోట్లాది రూబుల్స్‌ కేటాయించారు. తమ జోలికొచ్చే ముందు ప్రపంచ దేశాలు జిర్కాన్‌ను తలచుకోవాలని గతంలోనే రష్యా ప్రకటించింది. కాగా ఇప్పుడు సముద్ర ఉపరితలంపైనుండి మరోసారి పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని ప్రకటించింది. ఒకవేళ మూడో ప్రపంచయుద్ధ పరిస్థితులు ఏర్పడితే అమెరికాలోని నగరాలను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణికి ఉందని రష్యా గతంలోనే వెల్లడించింది. కాగా మలి ప్రయోగాన్ని ఇప్పుడు నిర్వహించింది.

గత డిసెంబర్‌లో తొలిసారిగా జిర్కాన్‌ను పరీక్షించిన అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాస్త్రవేత్తలను, రక్షణ బలగాలను ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సాటిరాగల క్షిపణులు ప్రపంచంలో మరెక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. సముద్ర జలాల్లోంచి సముద్రాల్లోని లక్ష్యాలను, భూమిపై లక్ష్యాలను ఛేదించే సత్తా తమ జర్కీన్‌ క్షిపణులకు ఉందని అప్పట్లో పుతిన్‌ ప్రపంచానికి వెల్లడించారు. తాజా పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరికల్లా రక్షణ దళాలకు విడతవారీగా జిర్కాన్‌ క్షిపణులను సరఫరా చేస్తామని, మొదట యుద్ధనౌకలకు, ఆ తరువాత జలాంతర్గాముల్లోను వీటిని మోహరిస్తామని రష్యా తెలిపింది. తాజా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను, ఫోటోలను రష్యా రక్షణశాఖకు చెందిన అధికార టీవీ చానల్‌ జ్వెజ్డా ప్రసారం చేసింది. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు పసిగట్టలేనంత వేగంగా ఈ అత్యంత వేగంతో దూసుకెళ్తాయని రక్షణశాఖ ప్రకటించింది. నిజానికి ఈ క్షిపణిని ప్రయోగించిన విషయం గానీ, అది దూసుకువెళ్లే మార్గం గానీ గుర్తించడం కష్టమని, కేవలం లక్ష్యాన్ని ఛేదించిన తరువాతే ఆ విషయం తెలుస్తుందని గోర్షకోవ్‌ కెప్టెన్‌ ఇగోర్‌ క్రోఖ్మాల్‌ విెవరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement