Wednesday, April 24, 2024

పిల్లల స్కూల్‌ను కూల్చేస్తారా?: విష్ణుకుమార్ రాజు

ఏపీలో ప్రజా వేదిక కూల్చడం ద్వారా ప్రారంభమైన కూల్చివేతల కార్యక్రమం.. మానసిక వికలాంగులైన విద్యార్థుల స్కూలును కూల్చేవరకు వచ్చిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజు విమర్శించారు. ఏపీలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విశాఖలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు.. జీవీఎంసీ అధికారులకు మెంటల్ వచ్చిందేమో అర్థం కావడం లేదన్నారు. అధికార మదంతో కొంత మంది జీవీఎంసీ అధికారులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. జీవీఎంసీ అధికారులు మనుషులా, పశువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం.. ప్రజలారా మేల్కోండి.. వింతైనా ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి’ అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని అంతటినీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసుల అపర్ణ విషయాన్ని రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి జబ్బు విశాఖపట్నం వచ్చిందని అన్నారు. డాక్టర్ సుధాకర్‌ని చంపింది ప్రభుత్వమే అని…. ఆయన చనిపోయే వరకు ప్రభుత్వం కక్ష సాధింపు చేశారని మండిపడ్డారు. నియంత పాలన ఎలా ఉంటుందో, రాష్ట్రంలో పోలీసులు చూపించాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జగన్ మెప్పు కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీ కోటలను బద్దలు కొట్టేస్తున్నా అంటున్నారని, ఢిల్లీ గురించి మాట్లాడితే తమ కోటలు బీటలు వాలిపోతాయి..జాగ్రత్త అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా సీఎం జగన్ ఫోటో తప్పితే మరి ఎవరి ఫోటో కనిపించదన్నారు. మంత్రులెవరు, ఉపముఖ్యమంత్రి ఎవరో ప్రజలకు తెలిసేలా అప్పుడప్పుడు ఫోటోలు వేయండి అంటూ విష్ణుకుమార్‌ రాజు ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement