Friday, April 26, 2024

తెలంగాణలో విద్యావంతుల పరిస్థితి దయనీయంగా మారింది: విజయశాంతి

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగులు ప‌డుతోన్న బాధ‌ల‌ను విజయశాంతి ప్రస్తావించారు. తెలంగాణలో ఆ బంధు… ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు లేనిపోని హడావుడి చేసే సీఎం కేసీఆర్ విద్యావంతుల పాలిట రాబందులా మారారు. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ.. ఇటీవల మీడియాలో గణాంకాలతో సహా బయటికొచ్చిన తెలంగాణలోని విద్యావంతుల పరిస్థితి అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేశారు.

ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 60 వేలమందికి పైగా విద్యావంతులైన యువతరం మరో మార్గం లేక స్ట్రీట్ వెండర్లుగా మారి తోపుడు బండ్లతో రోడ్ల మీదికి వచ్చారు. నోటిఫికేషన్లు రాపు… ఉద్యోగాల్లేవు… నిరుద్యోగభృతి లేదు… ఆశనిరాశల మధ్య ఆత్మహత్యలు ఆగడం లేదు’ అని విజ‌యశాంతి విమ‌ర్శించారు. ‘పట్టణ ప్రగతి – సర్వే ఆఫ్ స్ట్రీట్ వెండార్స్’ యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా స్ట్రీట్ వెండర్స్‌లో పీజీలు చేసినవారు, టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు…. ఇలా ఎందరెందరో కన్నీటి ధారలతో కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల మాట కల్ల అని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వార్తా కథనం వాస్తవాల్ని ప్రజల ముందుంచింది’ అని తెలిపారు. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా మోదీగారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణమే వీరికి కాస్తో కూస్తో ఊరట కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని వీధిన పడేయటం తప్ప చేసిందేమీ లేదని బాగా తెలిసొచ్చిందని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement